byసూర్య | Fri, Sep 20, 2024, 10:12 PM
భూమిపై విచక్షణ ఉన్న జీవి మనిషి అని చెప్తారు. పశువులకు లేని మనుషులకు ఉన్న అత్యంత విలువైన లక్షణం విచక్షణ. కానీ.. ప్రస్తుత సమాజంలో మనుషులు ఆ విచక్షణ కోల్పోయి.. వాళ్లు కూడా పశువులమే అని ప్రతిసారి నిరూపించుకుంటున్న సందర్భాలు ఎన్నో. రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, లైంగిక దాడులే అందుకు ప్రధాన సాక్ష్యాలు. ఆడవాళ్లు అయితే చాలు అన్నట్టుగా.. వావి వరసలు, వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. కామవాంఛ తీర్చుకునేందుకు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. బుడి బుడి అడుగులు వేసే చిన్నారుల దగ్గరి నుంచి.. కాటికి కాళ్లు చాపిన ముసలివాళ్ల వరకు.. ఏ వయసువారినీ వదిలిపెట్టకుండా లైంగిక దాడులు చేస్తూ.. జుగుప్స కలిగేలా చేస్తున్నారు. అలాంటి ఘటనే.. మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. బండమాదారం గ్రామంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బండమాదారంలోని క్వార్టర్స్‌లో 90 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు నివసిస్తోంది. అయితే.. కామంతో కళ్లు మాత్రమే కాదు బుద్ధి కూడా బ్రష్టు పట్టి పోయిన.. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై లైంగిక దాడికి తెగబడ్డారు. అయితే.. అందులో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికులకు దొరికిన వ్యక్తి.. కరెంట్ లైన్ వద్ద సహాయకుడిగా పనిచేసే వెంకట్ రావు(36)గా గుర్తించగా.. మరో ఇద్దరు యువకులు పారిపోయినట్టు తెలిపారు.
ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలపటంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. పరీక్షల నిమిత్తం వృద్ధురాలిను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారణ చేస్తున్నారు. స్థానికులు పట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవటంతో పాటు.. పారిపోయిన మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
అసలు అత్యాచారమే క్షమించరాని, కఠిన శిక్షార్హమైన నేరమైతే.. అందులో కాటికి కాళ్లు చాపిన 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలిపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి తెగబడటమనేది ఇప్పుడు అందరినీ హతాశులను చేస్తోంది. ఇప్పటికే.. చిన్న చిన్న పిల్లలపై దాడులకు తెగబడిన ఘటనలు వెలుగు చూడగా.. ఇప్పుడు ఇలాంటి ఘటనలు కూడా వెలుగులోకి రావటం.. సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అసలు సమాజంలో ఏం జరుగుతోంది.. ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయనేది తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.