byసూర్య | Fri, Sep 20, 2024, 10:00 PM
సాధారణంగా దేవాలయాలలో భక్తులు భజనలు చేస్తుంటారు. భజనలు చేసి స్వామివారిని స్మరించుకున్న తర్వాత.. తీర్థ ప్రసాదాలు తీసుకుంటుంటారు. కానీ.. ఇక్కడ భజనలు చేసే సమయంలో గంజాయిని వినియోగిస్తుంటారట. అది అక్కడి అనవాయితీ అని చెప్తూ.. తోటలోనే దుకాణం పెట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. తనకున్న 30 గుంటల స్థలంలో గంజాయి సాగు చేస్తూ.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా బట్‌పల్లి మండలం మరివెల్లి గ్రామంలో జుట్టు చిన్న నర్సింహులు అనే వ్యక్తి.. తనకున్న 125/యు/2 సర్వే నెంబరులోని 30 గుంటల స్థలంలో పత్తి, మిరప సాగు చేస్తున్నాడు. కేవలం మిరప, పత్తి మాత్రమే సాగు చేస్తే సమస్యే లేదు కానీ.. ఆ పంటల మధ్యలో గంజాయిని అంతర పంటగా వేసి సాగు చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సి. వీణారెడ్డి తన సిబ్బందితో వెళ్లి చేనులో పరిశీలించగా.. గంజాయి మొక్కలు కనిపించాయి. తన సిబ్బందితో కలిసి ఏకంగా 20 గంజాయి మొక్కలను చేనుల్లోంచి పీకేశారు.
అయితే.. పోలీసులు తన చేనులోకి వచ్చి గంజాయి చెట్లను పీకేస్తున్న విషయం తెలుసుకున్న పట్టాదారు జుట్టు చిన్న నర్సింహులు.. హుటాహుటిన తన కుటుంబ సభ్యులతో సహా అక్కడి చేరుకున్నాడు. గంజాయి సాగు చేస్తూ అడ్డంగా దొరికినప్పటికీ.. తాను మాత్రం సమాజాన్ని ఉద్దరిస్తున్నట్టుగా బుకాయించే ప్రయత్నం చేశాడు. తమ ఊరి దేవాలయంలో భజనలు చేసే సమయంలో ఈ గంజాయిని వినియోగిస్తామని.. అమ్మకం కోసం కాదంటూ కథలు చెప్పే ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రబుద్ధుడు చెప్పే కథలు ఏమాత్రం పట్టించుకోని అధికారులు.. అతనిపై కేసు నమోదు చేసుకుని.. అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న టీంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలో సీఐతో పాటు ఎస్సై అనిల్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఇ.విఠల్, కానిస్టేబుళ్లు మల్కయ్య, అనిల్ కుమార్, పహ్లాద్ రెడ్డి ఉన్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్‌మెంట్ టీంను తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి, మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్, అసిస్టేంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఏఈఎస్ శ్రీనివాసులు అభినందించారు.