తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు

byసూర్య | Fri, Sep 20, 2024, 09:56 PM

హైదరాబాద్‌లో మరో జూపార్క్ ఏర్పాటు కాబోతోంది.. ఈ మేరకు రేవంత్ సర్కార్ కసరత్తు కూడా చేస్తోంది. అయితే రెండో జూపార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతున్న సమయంలో.. హైదరాబాద్‌ నగరం శివారు ముచ్చర్ల ప్రాంతంలో ఏర్పాటయ్యే ఫోర్త్‌ సిటీలో జూపార్కు ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫోర్త్ సిటీ ఏర్పాటయ్యే ప్రాంతంలో ఏకంగా 15 వేల ఎకరాలకు పైగా రెవెన్యూ భూమి ఉంది.. అందుకే అక్కడ జూపార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారట.


కొత్తగా ఏర్పాటు చేయబోయే జూపార్కులో ప్రకృతి పర్యాటకం అభివృద్ధికి జూపార్కుతో పాటు నైట్‌ సఫారీ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు అధికారులు దేశంలో, ఇతర దేశాల్లో ఈ తరహా పర్యాటక ప్రదేశాల వివరాలపై ఆరా తీస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ‘వన్‌తారా’ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై అధ్యయనం చేస్తున్నారు. అనంత్‌ అంబానీ 3 వేల ఎకరాల్లో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే మరికొన్నటిపైనా అధ్యయనం చేస్తారు.


అంతేకాదు హైదరాబాద్‌ చుట్టుపక్కల హెచ్‌ఎండీఏ పరిధిలో అనేక అటవీశాఖకు చెందిన బ్లాకుల్లో లక్షన్నర ఎకరాల అటవీ ప్రాంతం ఉందని గుర్తించారు. దేశంలో ఏ నగరం చుట్టూ.. హైదరాబాద్ తరహాలో ఇంత విస్తీర్ణంలో అటవీ ప్రాంతం లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ప్రాంతం ప్రకృతి పర్యాటకానికి ఎంతో అనుకూలమైంది. అయితే రక్షిత అటవీ ప్రాంతాల్లో జూపార్కులను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు. ఈ జూలను రెవెన్యూ భూముల్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంది.. ఈ క్రమంలో ‘ఫోర్త్‌ సిటీ’ ప్రాంతంలో జూపార్కు, నైట్‌ సఫారీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.


ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ ఫోర్త్‌ సిటీ చుట్టుపక్కల దాదాపు 18 వేల ఎకరాల అటవీ భూములు ఉన్నట్లు తెలుస్తోంది. కడ్తాల్, మద్విన్, కురుమిద్ద, తాడిపర్తి, నాగిలి అటవీ బ్లాకుల పరిధిలో 15-16 వేల ఎకరాల అటవీశాఖకు చెందిన భూమి ఉంది. మరో రెండు వేల ఎకరాలు గుమ్మడవెల్లి అటవీ బ్లాక్‌లో రక్షిత అడవి ఉంది. ఈ అటవీ బ్లాకుల పక్కనే ఉండే రెవెన్యూ భూమిలో జూపార్కు ఏర్పాటు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 200 ఎకరాల్లో ఫోర్త్‌ సిటీలో జూపార్కు ఏర్పాటు చేసి.. పక్కనే వెయ్యి ఎకరాల అటవీ ప్రాంతాన్ని గ్రీన్‌ బెల్టుగా చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు జూపార్కుతో నైట్‌ సఫారీ వంటివి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కూడా అటవీశాఖ దగ్గర ఉన్నాయట.


ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఫోర్త్‌ సిటీలోని ఓ ప్రాంతంలో గుట్టలు, లోయలు, పెద్ద, పెద్ద చెట్లున్నాయి. రెవెన్యూ భూమి అయినా సరే అటవీ ప్రాంతంలో ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాన్ని జూపార్కు, నైట్‌ సఫారీకి ఆ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉంది అంటున్నారు. ఆ పక్కనే అటవీ బ్లాక్‌ ఉండటం అనుకూలంగా ఉందంటున్నారు. జూపార్కు, నైట్‌ సఫారీ వంటివి ఉండేలా ఇక్కడ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమయ్యే నిధులు, నిర్వహణను దృష్టిలో ఉంచుకుని.. పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం)లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. అందుకే వన్‌తారా ప్రాజెక్టును ఏర్పాటు చేసిన రిలయన్స్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Latest News
 

నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు జారీ Thu, Oct 10, 2024, 03:54 PM
మాదిగలను నమ్మించేందుకు సీఎం ఎన్నో ప్రకటనలు చేస్తున్నారని విమర్శ Thu, Oct 10, 2024, 03:52 PM
సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు Thu, Oct 10, 2024, 03:09 PM
నారాయణపేటలో మోస్తరు వర్షం Thu, Oct 10, 2024, 03:05 PM
జడ్చర్లలో ఓబీసీ మోర్చ ఆధ్వర్యంలో బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్ Thu, Oct 10, 2024, 03:04 PM