ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు

byసూర్య | Fri, Sep 20, 2024, 08:19 PM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు ఏర్పాటుకానున్నాయి. హైదరాబాద్‌ మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తూ.. ఓఆర్‌ఆర్‌ వెంబడి కాలనీలు, నివాసాలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా అవసరాలకు అనుగుణంగా జన్వాడ, కోహెడ, పడమటసాయిగూడల్లో కొత్తగా ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(HMDA)- హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్‌లో రానున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR)కు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులతో అనుసంధానమయ్యేలా ఓఆర్‌ఆర్‌పై కొత్త ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


ఓఆర్‌ఆర్‌ను వినియోగించుకునేందుకు తొలినాళ్లలో 19 ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి ద్వారానే నిర్ణీత ప్రదేశాల్లో ఓఆర్‌ఆర్‌పైకి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే, నగరం విస్తరిస్తుండటంతో ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గత ఏడాది నార్సింగ్‌, మల్లంపేట, కోకాపేట వద్ద ట్రంపెట్ల నిర్మాణం ప్రారంభించింది. కోకాపేట ట్రంపెట్‌ మినహా మిగతా రెండు అందుబాటులోకి వచ్చాయి. నార్సింగ్‌ ట్రంపెట్‌ ద్వారా గండిపేట, నార్సింగ్‌ పరిసర ప్రాంతాల్లోని వాహనదారులు ఓఆర్‌ఆర్‌ను సులభంగా వినియోగించుకునేలా వీలు కలిగింది.


అలాగే, మల్లంపేట ట్రంపెట్‌ వల్ల నిజాంపేట, బాచుపల్లి, మల్లంపేట, బౌరంపేట వాసులు ఓఆర్‌ఆర్‌పైకి సులభంగా చేరుకోగలుగుతున్నారు. అయితే, కోకాపేట ట్రంపెట్‌ పనులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే.. ఆ ప్రాంతంలోని వాసులు గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో సులువు కానుంది.


కొత్తగా జన్వాడ, కోహెడ, పడమటసాయిగూడ ప్రాంతాల్లో ఇంటర్‌చేంజ్‌ల వల్ల.. నగరం మూడు వైపుల వారికి ఉపయుక్తం కానుంది. జన్వాడ ఇంటర్‌చేంజ్‌.. కోకాపేటకు, ఈదుల నాగులపల్లికి మధ్యలో ఉంటుంది. కోహెడ ఇంటర్‌చేంజ్‌ పెద్ద అంబర్‌పేట-బొంగులూరు మధ్యలోనూ... ఘట్‌కేసర్‌-కీసర మధ్యలో పడమటసాయిగూడ ఇంటర్‌చేంజ్‌ ఏర్పాటు కానుంది.


మరోవైపు, రీజనల్‌ రింగురోడ్డుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఐఏ) రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించింది. మరో రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు రోడ్డు డిజైన్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఉత్తర భాగం (162 కిలోమీటర్లు.. సంగారెడ్డి నుంచి గజ్వేల్‌ మీదుగా చౌటు ప్పల్‌ వరకు) నిర్మాణం చేపట్టనున్నారు.


Latest News
 

వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM