అక్టోబర్ నుంచి రేషన్ కార్డుల జారీ.. సర్కార్ కీలక ప్రకటన

byసూర్య | Mon, Sep 16, 2024, 07:03 PM

తెలంగాలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించిన కీలక అప్‌డేట్ వెల్లడైంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అక్టోబర్‌లో ఈ రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల దరఖాస్తులు జారీ చేస్తామని తాజాగా తెలిపింది. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గం ఉప సంఘం తాజాగా భేటీ అయి కీలక విషయాలను చర్చించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. మీడియాకు వివరించారు.


కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక తెల్ల రేషన్ కార్డులు జారీ చేసేందుకు అర్హులు ఎవరు అనేదానిపై తర్వాతి భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారు అనేదానిపై ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని అని అన్ని పార్టీలకు లేఖలు రాశామని.. దీనికి స్పందించి కొంతమంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు, సలహాలు అందించినట్లు పేర్కొన్నారు. వారు ఇచ్చిన సూచనలను కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.


ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వారందరికీ ఉచితంగా 6కిలోల బియ్యం ఇస్తున్నామని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేవలం 49 వేల రేషన్ కార్డులను మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక అవి కూడా ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రమే రేషన్ కార్డులను జారీ చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొత్తం ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా రేషన్ కార్డులను జారీ చేస్తుందని చెప్పారు.


సెప్టెంబర్ 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా కేబినెట్ సబ్ కమిటీ.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై పూర్తి నివేదికను అందిస్తుందని.. వాటి ఆధారంగా అక్టోబర్ నెలలో రాష్ట్రంలో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రులు వెల్లడించారు. ఇక ఈ రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా ఉండగా.. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులుగా ఉన్నారు.


Latest News
 

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Sat, Sep 21, 2024, 10:44 AM
ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ Sat, Sep 21, 2024, 10:24 AM
యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM