బ్యాడ్‌లక్..కవిత రిమాండ్ మళ్లీ పొడిగింపు.. ఈడీ కేసులో 31వరకు, సీబీఐ కేసులో ఆగస్టు 8 వరకు

byసూర్య | Fri, Jul 26, 2024, 07:54 PM

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైలులో జ్యూడీషియల్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. సుమారు నాలుగు నెలల నుంచి జైలులోనే ఉన్న కవితకు బెయిల్ దొరకకపోగా.. రిమాండ్ కొనసాగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు మరోసారి కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ కేసులో కవిత రిమాండ్‌ను ఈ నెల 31 వరకు న్యాయస్థానం పొడిగించింది. మరోవైపు సీబీఐ దాఖలు చేసిన కేసులోనూ.. గురువారం (జులై 25) రాత్రి సమయంలో వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా.. కవిత రిమాండ్‌ను ఆగస్టు 8 వరకు పొడిగించారు. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు అధికారులు.. కవితతో పాటు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కోర్టు ముందు హాజరుపరిచారు.


 మరోవైపు.. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ ఛార్జిషీటులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం పాలసీ రూపకల్పనలో కవితే.. ప్రధాన సూత్రధారిగా సీబీఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం పాలసీని తయారు చేశారని.. అందుకు సౌత్ గ్రూప్ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందినట్టుగా అభియోగం మోపింది. సుమారు రూ. 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్టుగా సీబీఐ ఆరోపించింది.


కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్లై, అశోక్ కౌశిక్ పనిచేసినట్టుగా సీబీఐ చెప్తోంది. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, శరత్‌ రెడ్డి లాంటి వ్యక్తులు డబ్బులు సమకూర్చినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన సొమ్మును హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు సీబీఐ అభియోగం మోపింది.


కాగా.. ఈ కేసులో కవితను ఏప్రిల్ 11న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉండగానే కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ.. 3 రోజుల రిమాండ్ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు.. కవిత ఆరోగ్యం కూడా క్షీణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె జ్వరం, లోబీపీతో బాధపడుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా.. సుమారు 10 కిలోల వరకు కవిత తన బరువు కోల్పోయినట్టు తెలుస్తోంది.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM