రోడ్డుపైనే వాహనదారునిపై బూతుపురాణం బూటు కాలితో తన్ని,,,చేవెళ్ల ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహం

byసూర్య | Thu, Jul 25, 2024, 10:03 PM

ఇటీవలే.. హైదరాబాద్ శివారులోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఓ లారీ డ్రైవర్‌ను బూతులు తిడుతూ, చేతివాటం చూపించిన.. జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో.. ఆ పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఆ సంఘటన జనాలు మర్చిపోయారో లేదో.. మరో ట్రాఫిక్ పోలీస్.. మళ్లీ ట్రెండింగ్ అయ్యారు. వికారాబాద్‌ జిల్లా శంకర్‌ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కళాశాల వద్ద ట్రాఫిక్‌ పోలీసులు.. ఎప్పటిలాగే డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే చేవెళ్ల ట్రాఫిక్ సీఐ వెంకటేశం ఓ వాహనదారుని పట్ల దురుసుగా ప్రవర్తించాడు. నోటికొచ్చిన బూతులు తిట్టటమే కాకుండా.. బూటు కాలితో తన్నుతూ అత్యుత్సాహం ప్రదర్శించారు. సోమవారం (జులై 22వ తేదీన) నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా.. ఓ వాహనదారున్ని పరీక్షించగా అతనికి 90 పాయింట్లు వచ్చాయి. దీంతో.. అతనికి పోలీసులు చలాన్ వేస్తామని చెప్పగా.. "ఈ ఒక్కసారికి విడిచిపెట్టండి సార్ అంటూ" కానిస్టేబుల్ జందార్ శ్రీను, హోంగార్డ్ కేశవ్‌‌ను పక్కకు తీసుకెళ్లి బతిమాలుకుంటున్నాడు.


ఇంతలోనే.. రోడ్డుపై నుంచి వాళ్ల దగ్గరికి వెళ్లిన ట్రాఫిక్ సీఐ వెంకటేషం.. బూతుపురాణం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా అందరూ చూస్తుండగానే.. బూటు కాలితో తన్నుతూ ఆ వాహనదారున్ని తీసుకొచ్చారు. అప్పటికే అక్కడున్నవాళ్లు ఈ ఘటనను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తుండగా.. ఆ విషయాన్ని గమనించకుండా నోటికి, చేతికి పని చెప్పారు. సీఐతో పాటు మిగతా కానిస్టేబుళ్లు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల తీరును అక్కడున్న వాళ్లు వ్యతిరేకించగా.. వారిని గదమయించారు.


ఈ మొత్తం వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా.. అది కాస్త వైరల్ అయ్యింది. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ పోలీసులకు ఏమైంది.. ఒకరి తర్వాత ఒకరు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ.. మండిపడుతున్నారు. సీఐతో పాటు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. తాను మాత్రం ఏమీ ఇబ్బంది పెట్టలేదని.. రోడ్డు డౌన్ ఉండటం వల్ల అలా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. తమను బూతులు తిట్టినందుకే.. అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందని.. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు పెట్టినట్టు తెలిపారు. మరి చూడాలి.. ఈ అధికారిపై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా లేదా..?


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM