సబ్సీడి గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు ,,,,ఉచిత విద్యుత్ పథకానికి 2,418 కోట్లు

byసూర్య | Thu, Jul 25, 2024, 04:54 PM

తెలంగాణలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పార్టీకి అధికారం తెచ్చిపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. బడ్జెట్‌లోనూ ఆరు గ్యారెంటీలకు తగినట్టి కేటాయింపులు చేసింది. ముఖ్యంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలకు.. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది.


పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించేందుకు గానూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 39 లక్షల 57 వేల 637 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వివరించారు. కాగా.. ఇప్పటికే ఈ పథకం కోసం 200 కోట్లను ప్రభుత్వం వెచ్చించిందని పేర్కొ్న్నారు. కాగా... ఈ బడ్జెట్‌లో సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. దీంతో.. గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఇక ఎలాంటి పెండింగులు లేకుండా.. సబ్సిడీ డబ్బు అందనుంది.


ఉచిత విద్యుత్‌ కోసం 2418 కోట్లు


మరోవైపు.. ఈ ఏడాది మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నట్టు భట్టి విక్రమార్క ప్రస్తావించారు. 200 యూనిట్ల మేర విద్యుత్‌ వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని భట్టి తెలిపారు. ప్రజాపాలన- ప్రజా సేవ కేంద్రాల ద్వారా వచ్చిన ధరఖాస్తులను స్వీకరించి.. అర్హులైన వారందరికి ఈ ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు డిస్కంలు సున్నా బిల్లులు జారీ చేస్తున్నాయని.. ప్రభుత్వం ఆ బిల్లుల మొత్తం ఛార్జీలను డిస్కంలకు చెల్లిస్తుందని తెలిపారు. జులై 15 నాటికి 45,81,676 ఇళ్లల్లో వెలుగుల జిలుగులు నింపగా.. జూన్ వరకు అందించిన విద్యుత్తుకుగానూ డిస్కంలకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.583.05 కోట్లు చెల్లించిందన్నారు. కాగా.. ఈ బడ్జెట్‌లో ఉచిత విద్యుత్‌ కోసం 2,418 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.


మరోవైపు.. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలందరికీ టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎటువంటి పరిమితులు లేకుండా ఈ పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు వివరించారు. కాగా.. ఈ పథకాన్ని ఉపయోగించుకుంటూ.. ఇప్పటి వరకు 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారని.. ఫలితంగా వారికి 2,351 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యమనేది.. పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోందని వివరించారు. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా చెల్లిస్తోందని.. దీనివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై బిలియన్ డాలర్ కార్పొరేషన్‌గా అవతరించడానికి దోహదపడుతుందని భట్టి విక్కమార్క పేర్కొన్నారు.


త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ..


నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రధాన కర్తవ్యమని భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా తమ ప్రభుత్వం "ఇందిరమ్మ ఇళ్లు" నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడానికి పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు చెల్లిస్తామని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని తెలిపారు. పూర్తికాని వాటిని సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించి అర్హులకు అందజేస్తామన్నారు.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM