byసూర్య | Fri, Jul 12, 2024, 07:38 PM
చిన్న చొరవ, పొరుగువారి గురించి చేసే చిన్న ప్రయత్నం.. వారి కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపవచ్చు. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఇలాంటి ప్రయత్నమే జరిగింది. స్థానికుల చొరవ, పోలీసుల తక్షణ స్పందన.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేసే 45 ఏళ్ల ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది శుక్రవారం ఉదయం 8.20 గంటల సమయంలో విద్యుత్ నగర్‌లో.. నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కాడు. అక్కడ నుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని గమనించిన స్థానికులు వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల వ్యవధిలో చైతన్యపురి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెనుక నుంచి ఆ భవనం పైకి చేరుకున్న పోలీసులు అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి సైదాబాద్‌లోని కుటుంబసభ్యులకు అప్పగించారు. రాచకొండ పోలీసులు ఈ వీడియోను షేర్ చేశారు. ‘మీకు ఏదైనా ఆపద కలిగినా.. లేక మీకు తెలిసినవారు ఎవరైనా ఆపదలో ఉన్నా.. ఏమాత్రం సంకోచించకుండా 100 డయల్ చేయండి’ అని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం వాట్సాప్ నంబర్ 8712662111 కూడా ఇచ్చారు.