byసూర్య | Fri, Jul 12, 2024, 07:34 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి.. సుమారు 120 రోజులుగా తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో మళ్లీ సేమ్ సీన్ రిపీటయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. ఈడీ, సీబీఐ అధికారులు పెట్టిన కేసుల్లో బెయిల్ కోసం అటు రౌస్ ఎవెన్యూ కోర్టులో, ఇటు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. రెండు న్యాయస్థానాలు తిరస్కరించాయి. కాగా.. మరో ప్రయత్నంగా.. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. అయితే.. ఈ పిటిషన్ విషయంలోనూ గతంలో జరిగిందే రిపీటవుతోంది. ఈ పిటిషన్ విచారణ కూడా వాయిదా పడింది.
అయితే.. లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ అధికారులు సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా.. ఆ విచారణతో పాటు ఇటు డిఫాల్ట్ బెయిల్ పిటినషన్ విచారణను కూడా రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో.. సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై వాదనలు జరిగాయి. మద్యం కేసులో కవిత పాత్రపై సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు.. ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
అయితే.. సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నితేష్ రానా కోర్టుకి తెలిపారు. మరోవైపు తప్పులేవి లేవని సీబీఐ తరపు న్యాయవాది తెలపగా స్పందించిన జడ్జి కావేరి భవేజా.. ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని సూచించారు. కోర్టు ఆర్డర్ కూడా అప్‌లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా పేర్కొన్నారు. దీంతో జూలై 22కి తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను.. మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె జైలులో ఉండగానే సీబీఐ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. కాగా.. అప్పటి నుంచి.. ఆమె రిమాండ్‌ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది. దీంతో.. ఆమెకు బెయిల్ రావటం కష్టంగా మారింది.