హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Wed, Jul 10, 2024, 09:50 PM

 హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే వాహనాలు, ప్రయాణికులకు భారీ ఊరట కలగనుంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణను మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సచివాలయంలో తెలంగాణలోని రహదారులపై సంబంధిత అధికారులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులు విస్తరించడానికి.. భూసేకరణ ఎందుకు జాప్యమవుతోందని కలెక్టర్లను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షకు ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.


రహదారుల భూసేకరణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను రేవంత్ రెడ్డికి కలెక్టర్లు వివరించారు. భూముల మార్కెట్‌ ధరలు, రిజిస్ట్రేషన్‌ ధరల మధ్య భారీగా తేడాలు ఉండటంతో.. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావట్లేదని కలెక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ ప్రక్రియలో మానవీయ కోణంతో వ్యవహరించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. భూములు కోల్పోతున్న రైతులను పిలిచి స్వయంగా కలెక్టర్లు మాట్లాడాలని హితవు పలికారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులకు భూసేకరణ పూర్తయిందని.. వెంటనే పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఎన్‌హెచ్ఏఐకి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎన్‌హెచ్ఏఐ రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.


రీజినల్ రింగ్ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబర్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ.. త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్మూర్ - నాగ్‌పూర్ కారిడార్‌ నిర్మాణానికి ప్రభుత్వ భూములను కేటాయించాలని ఈ సందర్భంగా అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌-మన్నెగూడ పనులు త్వరగా ప్రారంభించాలని.. హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ వెంటనే చేపట్టాలని సూచించారు.


ఆర్మూర్ - జగిత్యాల - మంచిర్యాల.. విజయవాడ - నాగ్‌పూర్ రహదారులకు సంబంధించి అటవీ శాఖ భూముల బదలాయింపు సమస్యపై ఈ స‌మీక్షలో అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువ‌చ్చారు. వాటిపై స్పందించిన సీఎం.. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని.. నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములను అటవీ శాఖకు బదిలీ చేసి.. అటవీ శాఖ భూములను రహదారుల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. వివిధ శాఖ‌ల ప‌రిధిలోని యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలని.. ఏవైనా సమస్యలుంటే ఎన్‌హెచ్ఏఐతో సంబంధిత శాఖల అధికారులు మాట్లాడాలని పేర్కొన్నారు.


Latest News
 

మొక్కలు నాటిన పోలీసు సిబ్బంది Thu, Jul 18, 2024, 03:42 PM
రైతుల సంక్షేమమే లక్ష్యం Thu, Jul 18, 2024, 03:37 PM
జవహర్ నగర్ ఘటన పై ఎంపీ ఈటెల రాజేందర్ సిరియస్ Thu, Jul 18, 2024, 03:36 PM
తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేసిన ముదిరాజు సంఘం సభ్యులు Thu, Jul 18, 2024, 03:34 PM
తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ప్రత్యేక హారతి Thu, Jul 18, 2024, 03:33 PM