![]() |
![]() |
byసూర్య | Wed, Jul 10, 2024, 09:22 PM
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు రెండ్రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. బలమైన నైరుతి రుతపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కి. మీ. మధ్యలో ఆవర్తన కొనసాగుతుందని వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం నేడు బలహీనపడిందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, జయశంకర్-భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బలమైన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బాలులు వీస్తాయన్నారు. పలు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలన్నారు.
నేడు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉదయం పొడి వాతావరణం ఉంటుందని సాయంత్రానికి వర్షం పడే అవకాశం ఉందన్నారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జీహెచ్‌ఎంసీ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసింది.
ఇక మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో అత్యధికంగా 6.2 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.1 సెం.మీ, పాల్వంచ మండలం సీతారాంపట్నంలో 5.2 సెం.మీ, జయశంకర్ జిల్లా చిట్యాలలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ జల్లులు కురిశాయి.
నేడు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందన్నారు. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు.