తెలంగాణ పోలీస్ బాస్‌గా జితేందర్.. రవిగుప్తాకు కీలక బాధ్యతలు

byసూర్య | Wed, Jul 10, 2024, 07:26 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి, ఆ తర్వాత పాలనపై దృష్టి సారించేలోపే.. సార్వత్రిక ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇక ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఘట్టం పూర్తి కావడంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర పోలీస్ బాస్‌ను మార్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గతేడాది చివర్లో డీజీపీగా రవిగుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తాజాగా రవిగుప్తా స్థానంలో కొత్త డీజీపీగా జితేందర్‌కు రేవంత్ సర్కార్ అవకాశం కల్పించింది. ఇక ఇప్పటివరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియామిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన జితేందర్‌.. ఇప్పటివరకు ప్రస్తుతం డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. వీటితోపాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా అదనపు బాధ్యతలను కూడా జితేందర్‌ నిర్వర్తిస్తున్నారు. డీజీపీ జితేందర్‌.. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే మరో 14 నెలల పాటు ఆయన డీజీపీగా విధులు నిర్వర్తించనున్నారు.


ఇక డీజీపీ జితేందర్.. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందినవారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జితేందర్‌ 1992 బ్యాచ్ ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికైన జితేందర్ ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి పోసింగ్‌లో భాగంగా నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా కూడా సేవలు అందించారు. అనంతరం అప్పట్లో నక్సల్స్ హవా ఎక్కువగా ఉండే మహబూబ్ నగర్‌ ఎస్పీగా నియామకం అయ్యారు. ఆ తర్వాత గుంటూరు ఎస్పీగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం డిప్యుటేషన్‌పై సీబీఐలో చేరారు. ఆ తర్వాత 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్‌లో జితేందర్ విధులు నిర్వహించారు. ఆ తర్వాత డీఐజీగా ప్రమోషన్ అందుకుని.. విశాఖపట్నం రేంజ్‌ డీఐజీగా పనిచేశారు.


ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ-అప్పాలో పని చేసిన జితేందర్.. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా ఉన్నారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోనూ జితేందర్ ముఖ్య పాత్ర పోషించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గానూ పనిచేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా.. జైళ్లశాఖ డీజీగానూ జితేందర్ పనిచేశారు. డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్‌ను తాజాగా డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Latest News
 

జాతీయ మెగాలోక్ అదాలత్ Thu, Dec 12, 2024, 02:15 PM
గ్రామ గ్రామాన సిపిఐ వసంతోత్సవాలు విజయవంతం చేయాలి Thu, Dec 12, 2024, 02:12 PM
అనంతగిరిలో సిఎం కప్‌ క్రీడలు ప్రారంభం Thu, Dec 12, 2024, 02:10 PM
సదరం క్యాంపులో సమయపాలన పాటించని ఈఎన్టీ వైద్యుడు Thu, Dec 12, 2024, 02:07 PM
రైస్ మిల్లులో ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు.. Thu, Dec 12, 2024, 02:05 PM