![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 10:29 PM
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. రైతులకు రుణమాఫీ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల మేర రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈమేరకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. కాగా.. ఇఫ్పుడు రైతు రుణమాఫీ అమలు కోసం అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేసేపనిలో నిమగ్నమాయ్యిరి. ఈ నేపథ్యంలోనే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల్లోనే పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రకటించారు. మార్గదర్శకాలు ప్రకటించిన వెంటనే వాటికి అనుగుణంగా అర్హుల జాబితా సిద్ధం చేయటం.. లబ్దిదారులందరి రుణాలు మాఫీ చేయటం రోజుల వ్యవధిలోనే జరిగిపోనుంది.
అయితే.. తెలంగాణలోని రైతులందరికీ 2 లక్షలలోపు ఉన్న పంట రుణాలన్నింటినీ ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. ప్రచారానికి వెళ్లిన ప్రాంతానికి ప్రసిద్ధి చెందిన దేవుళ్లపై కూడా ప్రమాణాలు చేశారు. కాగా.. ఆయన ఇచ్చిన మాట మేరకు.. కసరత్తు ప్రారంభించారు కూడా. అయితే.. ఈ రుణాల మాఫీపై మంత్రివర్గంతో సమావేశం నిర్వహించి.. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. మరోవైపు.. రుణమాఫీ పథకం అమలు కోసం సూమారు 31 వేల కోట్లు అవసరమవుతాయని కేబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది. కాగా.. ఈ నిధుల సమీకరణ కూడా ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ
తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకంపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాపై బుధవారం (జులై 10న) ఖమ్మం నుంచి అభిప్రాయాల సేకరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. రైతులు, ఉద్యోగులు, మేధావులు, రైతు సంఘాల నేతల నుంచి ఈ పథకం అమలుపై అభిప్రాయాలు స్వీకరించనున్నట్టు వెల్లడించారు.
కాగా.. రాష్ట్రంలో రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ రైతు భరోసా విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే.. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. అందరి దగ్గరి నుంచి అభిప్రాయలు సేకరించి త్వరలోనే ఈ పథకానికి సంబంధించి తుది రిపోర్ట్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనుంది.