మా హయంలో జరిగింది ఫిరాయింపులు కాదు విలీనం.. రెండింటికి చాలా తేడా ఉంది: కేటీఆర్

byసూర్య | Tue, Jul 09, 2024, 07:42 PM

పార్టీ ఫిరాయింలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతోన్న కాంగ్రెస్.. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా నయవంచనకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావులతో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. 1967 లో హర్యానాలో గయాలాల్ అనే వ్యక్తి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఆయన పేరు మీదే ఆయారాం, గయారాం అనే సంస్కృతి వచ్చిందని.. ఆ కల్చర్‌ను అదే విధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రెండింటిని కాంగ్రెస్ పార్టీయే తెచ్చిందని గుర్తు చేశారు. 'ఎవరైతే రాజ్యాంగానికి మేం రక్షకులమని చెబుతున్నారో వాళ్లే ద్వంద్వ విధానాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉంటుందో దేశానికి తెలియజేసేందుకే ఢిల్లీకి వచ్చి మాట్లాడుతున్నాం. ఇదే రాహుల్ గాంధీ 2022లో గోవాలో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉండాలని వాళ్లతో ప్రమాణం చేయించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ వాళ్లు రూ. 50 కోట్లు ఇచ్చి మా ఒక్కో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కూడా మా ఎమ్మెల్యేలను తీసుకునేందుకు సామ, దాన, దండోపాయాలను ప్రయోగిస్తున్నారన్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీలోకి వెళితే ఆయనను డిస్‌క్వాలిఫై చేయాలని పోరాటం చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వాళ్ల పార్టీలోకి తీసుకుంటారు.


మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరితే దానికి కాంగ్రెస్ న్యాయపోరాటం చేసింది. అప్పుడే సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ కీలకమైన తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ 3 నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా తేల్చి చెప్పింది. హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఒక రాజ్యసభ సభ్యుడి విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. గోవా, కర్ణాటక, మహరాష్ట్ర, హర్యానాలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ వాళ్లు శోకాలు పెడతారు. అదే తెలంగాణలో ఏఐసీసీ అనుమతి తీసుకొని మరీ రేవంత్ రెడ్డి మా పార్టీ నాయకులను వాళ్ల పార్టీలో చేర్చుకుంటారు. ఇదెక్కడి నీతి? ఒక వైపు రాజ్యాంగాన్ని రక్షించే వాళ్లముంటూనే.. మరోవైపు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు.


ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. పార్టీ మారిన వాళ్లు పిచ్చి కుక్కలతో సమానమని రేవంత్ రెడ్డి అన్నారు. మరి రాహుల్ గాంధీని అడుగుతున్నా.. ఎవరు పిచ్చి కుక్కు? ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలి ? కర్ణాటకలో బీజేపీ మీ ఎమ్మెల్యేలను రూ.50 కోట్లు ఇచ్చి కొంటే మీరు తెలంగాణలో వంద కోట్లు ఇచ్చి కొన్నారా ? రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలె. రాహుల్ గాంధీ గారు ద్వంద్వ విధానాలను పాటిస్తామంటే అది కుదరదు. మీ విధానాలను ఢిల్లీ స్థాయిలో దేశ ప్రజలకు తెలిసేలా చేస్తాం. బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. దీనిపై విచారణ కూడా పెద్దగా అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ సీటు మీద గెలిచిన దానం నాగేందర్ అనే ఎమ్మెల్యే... కాంగ్రెస్ బీఫామ్‌తో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అని కేటీఆర్ అన్నారు.


కాంగ్రెస్ పార్టీ నీతి లేని వ్యవహారంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని వెల్లడించారు. రాజ్యాంగ పరిరక్షకులైన రాష్ట్రపతి గారిని కలిసి ఫిర్యాదు చేస్తామని.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి కాంగ్రెస్ విధానాలపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ బాధితులైన పార్టీలతో కలిసి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పోరాటం కొనసాగిస్తామన్నారు. 'ఇలాంటి అక్రమ వ్యవహారాలను సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయాల్సి ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈ క్రూరమైన క్రీడను కొనసాగిస్తూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ చేసే ఆరోపణలు సరికావు. గతంలో మేము విలీనం చేసుకున్నాం. విలీనానికి పార్టీ ఫిరాయింపులకు చాలా తేడా ఉంది. రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మోడీ నుంచి రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామంటూ ఫోజులు కొడతారు. మళ్లీ అదే రాజ్యాంగం స్ఫూర్తిని దెబ్బతీసేలా అక్రమంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. పాంచ్ న్యాయ్ పేరుతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామన్న రాహుల్ గాంధీయే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై బీఆర్ఎస్ అన్ని దారుల్లో పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది.' అని కేటీఆర్ స్పష్టం చేశారు.


కాంగ్రెస్ చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యనించారు. దాదాపు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే తాము ఓటమి పాలయ్యామన్నారు. కాంగ్రెస్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో ఎన్నో హామీలు ఇచ్చిందని.. ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపించి చాలా హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. 'స్వయంగా రాహుల్ గాంధే తెలంగాణకు వచ్చి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతకు హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన మరుసటి రోజే 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ 7 నెలలు గడిచినప్పటికీ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. 6 ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ మర్చిపోయింది. కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు.' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM