వైఎస్ జగన్ ఓటమి ఆశ్చర్యం కలిగించింది.. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా.. కేటీఆర్

byసూర్య | Tue, Jul 09, 2024, 07:32 PM

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవటం ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్.. మీడియాతో చిట్‌ చాట్ చేసిన నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నాడంటూ తమకు రిపోర్టులు వచ్చాయని.. కానీ తుది ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యలో ఏం జరిగిందనేది అంతుపట్టట్లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సంక్షేమం కోసం 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ.. ఓడిపోవటమనేది అంతుపట్టని విషయమన్నారు కేటీఆర్.


అందులోనూ.. రోజూ ప్రజల్లో ఉండే ధర్మావరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడం ఏమిటని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి కూటమిగా వచ్చినా కూడా జగన్‌కు 40 శాతం మేర ఓట్లు పోలవటమనేది సామాన్యమైన విషయం కాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఏం కావాలో, వాళ్ల పల్స్ పట్టుకోవడం ఎలాగో ఈ ఫలితాలు చూసిన తరువాత రాజకీయ నాయకులకు ఏమాత్రం అర్థం కావట్లేదని ఇంట్రెసింగ్ కామెంట్లు చేశారు.


మరోవైపు.. ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు వైఎస్ షర్మిలను ఒక పావుగా వాడుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక మీదట ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఏ మాత్రం ఉండబోదని.. ఆమె మరో కేఏ పాల్‌లా మారిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఏపీ ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు కేటీఆర్.ఇక.. తెలంగాణలో ఎన్నికల ఫలితాల ఆధారంగా ప్రజలది తప్పు అనడం సరికాదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందని.. ఇక నుంచి తమ వైఖరి మార్చుకోవాలన్నారు. అయితే.. పదేళ్లపాటు తాము చేసిన అభివృద్ధిని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. తమకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారని ఆరోపించారు. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి కొందరికి తేడా తెలియదన్నారు. అభివృద్ధిలో తమతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు. మరోవైపు.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదారాబాద్‌లో అన్ని సీట్లనూ తాము గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.


మరోవైపు.. బీఆర్ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆస్కార్ రేంజ్‌లో నటిస్తోన్నారంటూ సెటైర్లు వేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఎంపీలు పార్టీ ఫిరాయించడాన్ని తప్పుపడుతున్న రాహుల్ గాంధీకి.. తెలంగాణలో తమ పార్టీ చేస్తోన్న నిర్వాకం కనిపించట్లేదా అని ప్రశ్నించారు.


తాము మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తోన్నామంటూ లోక్‌సభలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపుల గురించి ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. ఫిరాయింపుల వ్యవహారంపై తాము త్వరలోనే రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ను కలుస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు సహా ఢిల్లీలోని ప్రతి ఫోరంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఫిరాయింపులకు చట్టపరమైన పరిష్కారాలపై నిపుణులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తమ పార్టీ ప్రజా ప్రతినిధులందరూ వెంటనే రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


Latest News
 

పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి Sun, Jul 14, 2024, 06:58 PM
శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు Sun, Jul 14, 2024, 06:56 PM
బాధితులకు ఆర్డీజ సహాయం అందచేత Sun, Jul 14, 2024, 06:55 PM
బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Sun, Jul 14, 2024, 06:55 PM
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM