byసూర్య | Sat, Jun 22, 2024, 07:58 PM
అభివృద్ధి, సంక్షేమంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పోటీ పడి పని చేసే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనలో ఉన్న ఆట నైపుణ్యం బయటపడి, ప్రజల గుర్తింపు రావాలంటే.. నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలని పెద్దలు చెప్తుంటారన్న మాటను రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. గతంలో తాను 12 గంటలు పని చేస్తే సరిపోతుందని భావించానని.. కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఆయన 18 గంటలు పని చేసి.. తాను మాత్రం 12 గంటలు పనిచేస్తే కుదరదన్నారు. ఇక నుంచి తనతో పాటు అధికారులు, సహచరులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
శనివారం రోజు (జూన్ 22న) హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని.. ఈ ఆస్పత్రిని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దారని రేవంత్ రెడ్డి కొనియాడారు. పేదలకు సేవలందించాలన్న అద్భుతమైన ఆలోచన 1988లో కార్యరూపం దాల్చిందన్నారు. సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది.. ఎన్టీఆరేనని వివరించారు. 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు లాంటి అనేక సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సినీ రంగాన్ని బాలకృష్ణ చూసుకుంటారని.. నారా లోకేష్, భరత్ రాజకీయాలు, సంక్షేమం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, తదతరులు పాల్గొన్నారు.
హెల్త్ టూరిజం హబ్‌గా హైదరాబాద్..
ఈ క్రమంలోనే.. ప్రపంచంతో పోటీ పడే విధంగా అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో వైద్య రంగంలో రాణించిన సంస్థలను రప్పించి అక్కడ వారికి అనుమతులు ఇస్తామని తెలిపారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే వారి కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి.