అదే నా ముఖ్య లక్ష్యం.. పార్టీ మార్పుపై ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు

byసూర్య | Sat, Jun 22, 2024, 07:40 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణకు మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో.. నిరంజన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ పాలనలోనే అన్నదాతలు సంతోషంగా, సుభిక్షంగా ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు చిన్న ఇబ్బంది జరగలేదని ఎర్రబెల్లి గుర్తు చేశారు.


రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుండాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. రైతులకు సాయం అనే సరికి రేవంత్ సర్కార్.. కోతలు, షరతులు పెడుతోందంటూ ఎర్రబెల్లి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ పాత రోజులు వచ్చాయన్నారు. ఈ క్రమంలోనే.. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కేసీఆర్‌ను మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.


రైతాంగం గొంతు కోయడమే తమ పని అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రజలను నమ్మబలికి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటికే అన్నదాతలకు రైతుబందు పడాల్సిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి.. మూడు సీజన్లు అవుతోందన్నారు. రైతు భరోసా కాదు కదా రైతు బంధు కూడా సరిగా ఇవ్వడం లేదని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారని.. అప్పటికే నాట్లు పూర్తవుతాయని చెప్పుకొచ్చారు. సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తారా అని ప్రశ్నించారు.


డిసెంబర్ 9 న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కేబినెట్‌లో చర్చించడం విడ్డూరమని నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను గుడ్డిగా వ్యతిరేకించడమే వారి పనిగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో జరిగిన మంచిని మంచిగా చెప్పడం కొందరికి నచ్చడం లేదన్నారు నిరంజన్ రెడ్డి.


Latest News
 

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM
4 లైన్ హైవేకు గ్రీన్ సిగ్నల్.. మారనున్న ఆ జిల్లా కేంద్రం రూపురేఖలు Wed, Oct 30, 2024, 08:21 PM