byసూర్య | Wed, May 29, 2024, 08:03 PM
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తుండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. ఆలయంలో హుండీ ఆదాయం భారీగా లభించింది. మంగళవారం సత్యనారాయణస్వామి వ్రత మండపంలో 35 రోజులకు సంబంధించి హుండీ లెక్కింపును ఆలయ అధికారులు చేపట్టారు.
స్వామి వారికి కానుకల రూపంలో రూ.3,93,88,092ల నగదు, 174 గ్రాముల బంగారం, ఏడు కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను కూడా భక్తులు స్వామివారికి సమర్పించినట్లు చెప్పారు. మెుత్తంగా యాదాద్రి ఆలయానికి రూ.4 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించినట్లు చెప్పారు.
ఒక్కరోజే రూ. 1.02 కోట్ల ఆదాయం..ఇక గత వారాంతంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. గత ఆదివారం ( మే 26) ఒక్కరోజున భారీ స్థాయిలో రూ.1.02 కోట్లు వివిధ విభాగాల ద్వారా ఆదాయం సమకూరింది. శుక్రవారం రోజు రూ.48.44 లక్షలు, శనివారం రోజు రూ.62.55 లక్షలు ఆదాయం రాగా.. రికార్డు స్థాయిలో ఆదివారం ఒక్కరోజే రూ.1.02 కోట్లు హుండీ ఆదాయం వివిధ కౌంటర్ల ద్వారా సమకూరింది. గత ఆదివారం సుమారు 81 వేల మంది స్వామివారిని దర్శించుకోగా.. శనివారం రోజున 75 వేల మంది, శుక్రవారం 60 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు.