జేసీ దివాకర్ రెడ్డికి రియల్టర్ ఝలక్.. సంతకం ఫోర్జరీ, పోలీసులను ఆశ్రయించిన జేసీ

byసూర్య | Wed, May 29, 2024, 07:59 PM

తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఓ రియల్టర్ ఝలక్ ఇచ్చాడు. జేసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి కోర్టును తప్పుదోవ పట్టించాడు. దీంతో జేసీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. జేసీ దివాకర్ రెడ్డి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు-10లో నివసిస్తుండగా.. రోడ్‌ నంబరు-62లోనూ ఆయనకు మరో ఇల్లు ఉంది. అది ఖాళీగా ఉండటంతో దాన్ని తమ వ్యాపార నిమిత్తం కావాలని రియల్టర్, సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణ జేసీని కోరాడు.


దీంతో మూడేళ్ల ఒప్పందంతో 2020 జూన్‌లో జేసీ తన ఇంటిని బూదాటికి అద్దెకు ఇచ్చారు. ఒప్పంద గడువు 2023 మేతో ముగియగా.. ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు రియల్టర్ బూదాటిని కోరారు. అయినా అతడు ఇల్లు ఖాళీ చేయకపోటవంతో జేసీ కోర్టును ఆశ్రయించారు. ప్రతిగా బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు ఇంకా లీజు గడువు ఉన్నట్లు సిటీ సివిల్‌ కోర్టులో మరో పిటిషన్‌ వేశారు.


ఈ మేరకు జేసీకి సిటీ సివిల్ కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ... తన సంతకం ఫోర్జరీ జరిగిందని గుర్తించాడు. ఒప్పందం తేదీని 2021 మే నెలగా అందులో చూపినట్లు గుర్తించారు. ఫోర్జరీ సంతకాలు, ఫేక్ డాక్యుమెంట్లతో బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్‌ షాజుద్దీన్‌లు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని జేసీ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


Latest News
 

హైడ్రాకు తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శ Mon, Dec 02, 2024, 05:08 PM
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీసులు ఆంక్షలు Mon, Dec 02, 2024, 04:28 PM
డిసెంబరు 4న 593 మందికి సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలు Mon, Dec 02, 2024, 04:26 PM
డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి సమీక్ష సమావేశాలు Mon, Dec 02, 2024, 04:23 PM
వైద్యాధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ధర్నా Mon, Dec 02, 2024, 04:22 PM