'గతంలో ఎప్పుడూ ఇలా లేదు, ఇదే ఫస్ట్ టైం'.. ఇదేనా కాంగ్రెస్ తెస్తానన్న మార్పు..?

byసూర్య | Wed, May 29, 2024, 07:21 PM

తెలంగాణలో ఓవైపు రోహిణి కార్తె మొదలైంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు రేపో మాపో ఎంట్రీ ఇస్తున్నాయి. దీంతో.. జల్లులు కురిసేలోపు పొలాలు చదును చేసుకుని.. విత్తనాలు, ఎరువులతో సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఎరువులు, విత్తనాల కోసం ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు వెళ్తే.. అక్కడ చాంతాడంత లైన్ దర్శనమిస్తోంది. దీంతో.. వేకువజామునే వచ్చి పడిగాపులు పడుతున్నారు. ఎండలో క్యూలో నిలబడలేక.. పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులను లైన్‌లో పెట్టి నీడ పట్టు చూసుకుంటున్నారు. ఇందుకోసం వేకువజామున వస్తే.. తిండీ తిప్పలు లేకుండా ఎండలో ఇబ్బంది పడాల్సి వస్తోందంటూ రైతులు చెప్తున్నారు. ఈ పరిస్థితిని చూసి.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తోంది.


ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. జగిత్యాలలో ఆగ్రోరైతు సేవా కేంద్రం ముందు పడిగాపులు పడిన రైతుల ఇబ్బందులకు సంబంధించిన వీడియోను కూడా ట్వీట్‌కు జత చేసింది. ఆగ్రో రైతు సేవా కేంద్రం ముందు పట్టా పాస్ పుస్తకాలకు సంబందించిన జిరాక్స్ కాపీలను లైన్లో పెట్టారు. జిలుగు విత్తనాల కోసం ఎన్నడూ కూడా లైన్‌లో నిలబడలేదని.. ఇప్పుడే ఇలా జరుగుతోందంటూ రైతులు వాపోయారు.


అయితే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా.. జిలుగు విత్తనాల కోసం ఈసారి కొత్త రూల్స్ పెడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. జిలుగు బస్తాల కోసం వస్తే.. కొత్తగా ఏఈవో సంతకం చేయించుకుని రావాలంటూ పంపిస్తున్నారని.. ఇంతకు ముందు ఎప్పుడు ఈ రూల్ లేదని.. ఇదే ఫస్ట్ టైం అంటూ చెప్పుకొస్తు్న్నారు. ఇంతకు ముందు ఓసారి వస్తే దొరకక వెళ్లిపోయామని.. మళ్లీ ఈరోజు వేకువజామునే ఆరు గంటలకు వచ్చి లైన్ కడితే కూడా దొరికే పరిస్థితి కనిపించట్లేదని చెప్తున్నారు. తిండి తిప్పలు లేక ఎండలో ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తుందని రైతులు ప్రశ్నించారు.


మొన్నటివరకు పండించిన వడ్లు కొనక అలా భాదపెట్టారని.. ఇప్పడు విత్తనాల కోసం ఇలా ఇబ్బంది పెడుతున్నారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో మంచి చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని.. కానీ అరిగోస పెడుతున్నారన్నారు. ఇలాగే ఉంటే.. ఇక పంటలు పండిచేది లేదని.. తమ వరకు మాత్రమే పండించుకుని తింటామని చెప్పుకొచ్చారు. వీటన్నింటికి సంబంధించిన వీడియోను జత చేస్తూ.. ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు? అంటూ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం దగ్గర ఉదయం 6 గంటల నుంచే జిలుగు విత్తనాల కోసం పాస్ బుక్కులతో రైతులు క్యూ కట్టారని తెలిపింది. గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా రైతులను ఎండలో రోడ్ల మీద నిలబెట్టి అసమర్థ కాంగ్రెస్ మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడింది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిలదీసింది.


Latest News
 

రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM
వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM