కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్

byసూర్య | Wed, Apr 24, 2024, 10:04 PM

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది లిస్ట్‌ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసే గడువు గురువారంతో ముగియనుండగా.. బుధవారం రాత్రి మిగిలిన 3 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదని.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. ఎట్టకేలకు హస్తం పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో గట్టి పట్టున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. ఆ స్థానాన్ని తన వియ్యంకుడికి ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు.


తెలంగాణలో మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ బుధవారం రాత్రి ప్రకటించారు. ఇందులో హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. హైదరాబాద్‌ స్థానం నుంచి మహ్మద్ సమీర్‌కు అవకాశం కల్పించారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బంధువు రామసహాయం రఘురాంరెడ్డికి అవకాశం దక్కింది. ఇక కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు పేర్లను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేశారు.


అయితే ఖమ్మం ఎంపీ స్థానానికి సంబంధించి టికెట్ కేటాయించకుండానే మంత్రి పొంగులేటి బంధువు రామసహాయం రఘురాంరెడ్డి.. నామినేషన్ దాఖలు చేయడం తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లాబీయింగ్‌తోనే ఖమ్మం టికెట్ రామసహాయం రఘురాం రెడ్డికి దక్కిందని హస్తం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక గురువారంతో తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు చివరి రోజు కానుంది.


 ఈ ఖమ్మం స్థానానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ పేరు కూడా రేసులో ఉండగా.. చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఖమ్మం స్థానాన్ని తన కుటుంబానికి ఇప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ టికెట్‌ను తన భార్య నందినికి కేటాయించాలని.. ఒకవేళ అది కుదరకపోతే.. రాయల నాగేశ్వరరావుకు అయినా ఇవ్వాలని భట్టి విక్రమార్క చివరి వరకు ప్రయత్నించారు. ఈ పంచాయతీ కాస్త పొరుగున ఉన్న కర్ణాటకకు చేరగా.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో చర్చలు జరిపారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM