నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు

byసూర్య | Fri, Mar 01, 2024, 09:32 PM

ఎన్నికల సమయంలో ‘ధరణి’ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తూ.. తాము అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ధరణి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై రేవంత్ సర్కారు దృష్టిసారించింది. ఇందుకోసం మార్చి 1 (శుక్రవారం )నుంచి 9 వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన తహసీల్దార్‌, ఆర్డీవోలకు పలు అధికారాలను దఖలుపరిచింది. ఇటీవల ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా‌సరెడ్డి, ఉన్నతాధికారులతో ధరణి కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులకు వెంటనే పరిష్కారించాలని నిర్ణయించారు.


ఈ నేపథ్యంలో ధరణి పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించేలా సీసీఎల్‌ఏ నవీన్‌మిట్టల్‌ గురువారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. మార్చి 9 నాటికి స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి, మండలాల వారీగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి మండలానికి రెండు-మూడు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మార్వో ఆఫీసులో ఏర్పాటు చేసే ఈ బృందానికి తహసీల్దార్‌ లేదా డిప్యూటీ తహసీల్దార్‌ లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారులు నేతృత్వం వహించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.


స్పెషల్‌ డ్రైవ్‌లలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలన్న ఆయన.. కలెక్టర్లు ఏరోజుకారోజు ఆర్డీవోలు, తహసీల్దార్ల ద్వారా పురోగతిని తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధరణిలో దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణల అధికారం కేవలం కలెక్టర్లకే ఉండేది. తాజా ఉత్తర్వుల్లో ఆ అధికారాలను ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా దఖలుపరుస్తున్నట్లు స్పష్టంచేయడం గమనార్హం. కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌.. ఇలా ఏయే అధికారి స్థాయిలో ఎలాంటి సమస్యలను పరిష్కరించాలో వివరంగా పేర్కొన్నారు.


దరఖాస్తుదారుడి భూమి విలువ రూ.5 లక్షల్లోపు ఉంటే ఆర్డీవో.. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల్లోపు ఉంటే కలెక్టర్లు, రూ.50 లక్షలకు పైన ఉంటే సీసీఎల్‌ఏ ఆ దరఖాస్తులను పరిష్కరిస్తారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం.. ఒక దరఖాస్తును ఆమోదించినా? తిరస్కరించినా? అందుకు కారణాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. జాప్యం లేకుండా అధికారులకు స్పష్టమైన గడువును విధించారు. తహసీల్దార్‌ ఏడు రోజులు, ఆర్డీవో 3 రోజులు, అదనపు కలెక్టర్‌ 3 రోజులు, కలెక్టర్‌ ఏడు రోజుల్లో ఆయా దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. కాగా, ఈ నెల 9 వరకు నిర్వహించనున్న స్పెషల్‌ డ్రైవ్‌ల వల్ల ప్రజలు తమ విలువైన భూములను దక్కించుకుంటారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. భూరికార్డుల పాలిట శరాఘాతంగా ఉన్న ధరణి పోర్టల్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు.Latest News
 

ఈ నెల 24న ఇంటర్‌ ఫలితాలు విడుదల Sun, Apr 21, 2024, 10:50 AM
క్షుద్ర పూజలు కలకలం Sun, Apr 21, 2024, 10:49 AM
పాఠశాల బస్సు, బైక్ ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం Sun, Apr 21, 2024, 10:48 AM
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పిటిసి Sun, Apr 21, 2024, 10:43 AM
బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM