బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు

byసూర్య | Fri, Mar 01, 2024, 09:26 PM

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పేర్కొంటూ మార్చి 1న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేతలు నేడు మేడిగడ్డకు వెళ్లి.. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని నిరూపించాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ ఛలో ‘పాలమూరు రంగారెడ్డి’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.


 పాలమూరు–రంగారెడ్డి పర్యటనకు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారని, ఆయన అన్యాయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఉద్ఘాటించారు. నీటి వాటాల్లో తెలంగాణకు చేసిన అన్యాయాలను ఆధారాలతో నిరూపించేందుకు మేం సిద్ధమని స్పష్టం చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే.. మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు.


బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శనకు వెళ్లే ముందు.. అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలని ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్‌ డిమాండ్‌ చేశారు. నేషనల్‌ డ్యామ్స్‌ అథారిటీ సూచనలు పట్టించుకోకుండా.. శాస్త్రీయత లేకుండా నిర్మించారు. మేడిగడ్డను బొందలగడ్డ అని పిలిచిన కేసీఆర్‌.. మరి బీఆర్‌ఎస్‌ నేతలను అక్కడికి ఎందుకు పంపుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని నిలదీశారు.


అటు, శుక్రవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బీఆర్‌ఎస్ నేతలు ఏడు బస్సుల్లో బయలుదేరి వెళ్తున్నారు. మొత్తం 150 మంది నేతలు మేడిగడ్డకు పయనంకానున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించి.. అక్కడి నుంచే మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.


మధ్యాహ్నం భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత... సాయంత్రం మేడిగడ్డ వద్ద కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్‌ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి వెళ్తోన్న కేటీఆర్‌కు జనగామ సమీపంలో నెల్లుట్ల వద్ద ఉదయం 10 గంటలకు వరంగల్ నేతలు స్వాగతం పలికి ర్యాలీగా మేడిగడ్డకు బయలుదేరి వెళ్లనున్నారు.


గురువారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు, బాల్క సుమన్‌, తదితర నేతలు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిసరాల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే, హనుమకొండలోని స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన నివాసంలో వరంగల్‌ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్ఎష్ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్‌, నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చూపుతామని, ప్రాజెక్టును రాజకీయం కోసం వాడుకుంటున్న కాంగ్రెస్‌ బండారం బయటపెడతామని కడియం శ్రీహరి చెప్పారు.


Latest News
 

హైదరాబాద్‌లో భారీవర్షం.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు Thu, Oct 10, 2024, 09:51 PM
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం Thu, Oct 10, 2024, 08:59 PM
15న పూడూర్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సురేఖ రాక Thu, Oct 10, 2024, 08:21 PM
దుబ్బాకలో ఘనంగా బతుకమ్మ సంబరాలు Thu, Oct 10, 2024, 08:06 PM
హమాలీల సంక్షేమానికి కృషి చేయాలి Thu, Oct 10, 2024, 08:00 PM