byసూర్య | Tue, Feb 20, 2024, 09:50 PM
మూసీ నదికి పునర్వైభవం తీసుకొస్తామని రేవంత్ సర్కారు చెబుతోంది. మూసీ నది పునరుజ్జీవనం తమ ప్రభుత్వ లక్ష్యంగా సీఎం రేవంత్ ప్రకటించారు. లండన్లో థేమ్స్ నదిని సందర్శించటంతో పాటు దుబాయి, హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవనం గురించి సమావేశాలు జరిపారు. ఫిబ్రవరిలో ప్రకటించిన మధ్యంతర బడ్జెట్లో మూసీ నది అభివృద్ధికి రూ.1000 కోట్లు ప్రకటించారు.
55 కిలోమీటర్ల పొడవున్న మూసీ నదికి పునర్జీవనం తెచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్‌రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్‌తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లోని గ్రామ పటాలు, గరిష్ఠ వరద ప్రవాహం రికార్డులను పరిగణనలోకి తీసుకుని.. ఉన్న హద్దులను పక్కాగా గుర్తించడం, గర్భంలోని వ్యర్థాల తొలగింపు, ఇతరత్రా పనులు చేపట్టడం తదితర చర్యలపై చర్చించారు.
మూసీ అభివృద్ధిలో భాగంగా ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం సూచించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. పర్యాటకంగా, ఆహ్లాదకరమైన ఉద్యానంగా మార్చాలన్నారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. 'మూసీ శుభ్రత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి. ఇందులో భాగంగా నిరంతరం మంచి నీరు పారించడం కీలకం. భవిష్యత్తులో చుక్క మురుగు నీరైనా నదిలో కలవకుండా చూడాలి. మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీల) ద్వారా వస్తున్న నీటినే మూసీలోకి మళ్లించడం, మరోవైపు ఎగువ నుంచి నదిలోకి మంచి నీళ్లు వచ్చేలా రివర్ లింక్డ్ ప్రాజెక్టుపైనా దృష్టిసారించాలి. దీని సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయండి.' అని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
మూసీ నది రూపు మార్చేందుకు అవసరమైతే డ్రోన్లతో సర్వే చేపట్టాలన్నారు. ఎక్కడెక్కడ, ఎంత మేర వ్యర్థాలున్నాయో తేల్చాలన్నారు. ఆక్రమణలు, పరీవాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు పునరావాసం, ఆక్రమణల తొలగింపులో తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రధానంగా దృష్టిసారించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.