byసూర్య | Mon, Dec 04, 2023, 10:59 PM
తెలంగాణ రాజకీయాల్లో ఓ సెన్సేషన్. ఆయన తన పదునైన మాటలు.. దూకుడుతో ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తారు. ఫియర్‌లెస్ స్పీచ్‌తో అగ్రెసివ్‌గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. ఆయన పొలిటికల్ కెరీర్ 20 ఏళ్లు కూడా లేకపోయినా.. 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కావటమే కాదు.. ఏకంగా ఆ పార్టీని తెలంగాణలో అధికారంలోకి కూడా తీసుకొచ్చారు. జడ్పీటీసీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు సీఎం రేసులో నిలిచారు. అయితే ఆయన గురించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ చాలా మందికి తెలిసినా.. ఆయన గతం గురంచి, పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రేవంత్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో స్టూడెంట్ లీడర్‌గా రేవంత్ పనిచేశారు. ఏవీ కాలేజీ నుంచి ఆయన డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన కొన్నాళ్ల పాటు ఓ పత్రికలో జర్నిలిస్టుగా పని చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం ఓ వార పత్రికలో పని చేస్తున్న సమయంలోనిది తీసిన చిత్రం అదేనంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోను ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు షేర్ చేస్తున్నారు.
ఇదిలావుంటే తెలుగుదేశం పార్టీతో రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారభించారు. 2004లో టీడీపీలో చేరిన రేవంత్.. 2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ జెడ్పీటీసీగా పోటీ చేశారు. టీడీపీ నామినేషన్ తిరస్కరించటంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 2008లో ఉమ్మడి ఏపీ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్‌సీగా విజయం సాధించి సంచలనం సృష్టించారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. మళ్లీ 2014లోనూ కొడంగల్ నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ పగ్గాలు చేపట్టాక సీనియర్లు, జూనియర్లను కలుపుకొని ముందుకువెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం రేవంత్ సీఎం రేసులో ఉండగా.. సాయంత్రానికి సీఎం ఎవరనేది తేలనుంది.