ఓటమిని ఒప్పుకున్నట్టుగా హరీశ్ రావు వీడియో,,,,నెట్టింట తెగ వైరల్ అవుతున్న వీడియో క్లిప్

byసూర్య | Fri, Dec 01, 2023, 11:45 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇప్పటికే ఫలితాలపై ఓ అంచనాకు వచ్చేశాయి. దీంతో.. రాష్ట్రమంతా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్‌ పార్టీకే ఓటర్లు పట్టం కడతారని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. దీంతో.. కౌటింగ్ మరో రెండు రోజులు ఉండగానే.. కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు సంబురాలు షురూ చేశారు. ఈ క్రమంలోనే.. బీఆర్‌ఎస్‌లో కీలక నేత హరీశ్ రావుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


"టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా ప్రజల కోసం పనిచేస్తాం. గెలుపోటములు ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఓటమికి గల కారణాలను ఏంటనేది లోతుగా సమీక్షించుకుంటాం. ఈ ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటాను. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.." అని హరీశ్ రావు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో మెదక్ ఎంపీ, ప్రస్తుతం దుబ్బాక నుంచి పోటీ చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు.


అయితే.. ఫలితాలు వెల్లడికాక ముందే.. హరీశ్ రావు ఓటమి ఒప్పుకోవటమేంటీ.. ఆ ఓటమి బాధ్యతను తాను తీసుకోవటమేంటీ.. ఆ వీడియో నిజం కాదు, పక్కా డీప్ ఫేక్ అని.. గులాబీ అభిమానులు బీపీ తెచ్చుకోకండి. ఆ వీడియో నిజమే. అలా అని.. వారి ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు షేర్లు చేసేందుకు సిద్ధం కాకండి. ఆ వీడియో నిజమే.. ఓటమి గురించి హరీశ్ రావు అన్న ప్రతి మాట నిజమే. కానీ.. ఆ వీడియో మాత్రం ఇప్పటిది కాదు. దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు.. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ.. విడుదల చేసిన వీడియో అది.


అప్పటి వీడియోను ఇప్పుడు కొందరు ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని నమ్ముతున్న కొంతమంది.. ఇలా ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. కేవలం హరీశ్ రావుదే కాదు.. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన కీలక నేతల మీమ్స్ కూడా వైరల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినట్టుగా.. ప్రగతిభవన్ ఖాళీ చేస్తున్నట్టుగా మీమ్స్ చేయటమే కాకుండా.. కేసీఆర్ సహా పలువురు నేతలు కంటతడి పెట్టుకున్న వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు కూడా హరీశ్ రావు ధన్యవాదాలు చెప్తూ.. ఓ ట్వీట్ చేశారు. "శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం దాదాపు 100 రోజుల పాటు ఎంతో శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి. ప్రజా క్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో మీరు పడిన కష్టం, తపన నాతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకం." అంటూ ట్వీట్ చేయగా.. ప్రత్యర్థులు మాత్రం పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM