గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. అధికారాన్ని డిసైడ్ చేసేది ఈ సెగ్మెంట్లే

byసూర్య | Fri, Dec 01, 2023, 07:53 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కాగా.. వాటిని జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఇక డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానుండగా.. వాటి కోసం అభ్యర్థులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తామని బీఆర్ఎస్, తమదే అధికారమని కాంగ్రెస్.. లేదు తాము పోటీలోనే ఉన్నామని బీజేపీ అంటోంది. కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా హంగ్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.


అయితే సీఎంను డిసైడ్ చేసింది గ్రేటర్ హైదరాబాద్ సెగ్మెంట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలు కూడా గ్రేటర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. గ్రేటర్‌లో గెలిచిన వారికే అధికారం దక్కించుకునే అవకాశం ఉంటుంది. గ్రేటర్ దాని చుట్టుపక్కల పరిధిలో మొత్తం 29 స్థానాలు ఉండగా.. మెజార్టీ స్థానాలు సాధించిన వారికే అడ్వాంటేజ్ ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటి అధికారంలోకి వచ్చింది. ఎల్బీనగర్, మహేశ్వరం, గోషామహల్ వంటి సీట్లు మినహా గంపగుత్తగా బీఆర్ఎస్- మజ్లిస్ పార్టీ స్థానాలకు కైవసం చేసుకుంది.


ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో బలంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో మజ్లిస్ పార్టీ సీట్లు 7 గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ బలంగా ఉందని అంటున్నారు. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్ స్థానాలలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు. సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇక కాంగ్రెస్ కూడా గ్రేటర్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది. గ్రేటర్‌లో కాంగ్రెస్ సీట్లు తక్కువగా వస్తే ఆ పార్టీకి అధికారం దక్కే అవకాశం ఉండదు. ఇది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న భయం. నాలుగైదు స్థానాల్లో కాంగ్రెస్ పోటీలో ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. గ్రేటర్‌లో గత ఎన్నిక రిజల్ట్స్ రిపీట్ అయితే మాత్రం అధికారానికి ఆమడ దూరం ఉండాల్సిందేనని కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. రూరల్‌లో కాంగ్రెస్ బలంగా ఉన్నా.. అర్బన్ ఓటర్లలో ఆ పార్టీకి మద్దతు లేదని గత కొంత కాలంగా వినిపిస్తున్న మాట. అయితే ఈసారి అలా జరగదని..రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌పై మెజార్టీ సాధిస్తామని అంటున్నారు. ఇబ్రహీంపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి , రాజేంద్రనగర్ వంటి స్థానాల్లో కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ముస్లింలు, సెట్లర్లలో ఓ వర్గం తమకే ఓటు వేశారని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


బీజేపీ కూడా గ్రేటర్‌పై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఉత్తర తెలంగాణ తర్వాత బీజేపీ ఆశలు పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పైనే. గోషామహల్, అంబర్‌పేట, ముషీరాబాద్ స్థానాల్లో ఆ పార్టీ ముందు నుంచి బలంగా ఉంది. పైగా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేటర్ స్థానాలను కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి పాత స్థానాలకు అదనంగా మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, బీఆర్ఎస్-మజ్లిస్ బంధం తమకు ఓట్లు తెచ్చిపెడుతుందని కాషాయం నేతలు చెబతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ బలంగా లేకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో ప్రజలు తమనే ప్రత్యామ్నాయంగా భావించారని అంటున్నారు. గ్రేటర్‌లో అనుకున్నని సీట్లు సాధిస్తే.. తెలంగాణాలో హంగ్ ఖాయమని అప్పడు తామే కింగ్ మేకర్ అవుతామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.



Latest News
 

*మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి* Sat, Oct 26, 2024, 03:23 PM
కేటీఆర్ తీరు పై మండ్డిపడ్డ కాంగ్రెస్ నాయకులు Sat, Oct 26, 2024, 03:18 PM
గాయత్రి విద్యానికేతన్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ Sat, Oct 26, 2024, 03:15 PM
కోదండ రెడ్డిని కలిసిన చెవిటి వెంకన్న యాదవ్ Sat, Oct 26, 2024, 03:15 PM
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 03:13 PM