byసూర్య | Thu, Nov 30, 2023, 03:11 PM
అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు కల్వకుర్తిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. పట్టణంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారం మేరకు బీఆర్‌ఎస్‌కు చెందిన మున్సిపల్ చైర్మెన్ సత్యం అనుచరులతో కలిసి వారి వద్దకు వెళ్లి గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది.
మున్సిపల్ చైర్మెన్ సత్యం ఆగ్రహంతో ఊగిపోతూ మాజీ వైస్ ఎంపీపీ బొమ్మ ఆంజనేయులు, రమాకాంత్ రెడ్డిపై చెయ్యి చేసుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువురినీ శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అకారణంగా మాపై దాడి చేశారంటూ పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు వ్యాపార సంస్థలను మూసేసి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. మున్సిపల్ చైర్మెన్‌పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.