మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర, అమల్లోకి ఆంక్షలు

byసూర్య | Tue, Nov 28, 2023, 06:34 PM

తెలంగాణలో సుమారు రెండు నెలలుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ప్రచారానికి తెర పడింది. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది. నేతలందరూ చివరి నిమిషం వరకూ సర్వశక్తులను ఒడ్డి ప్రచారం చేశారు. గల్లీలన్నీ ప్రచార రథాలతో, పార్టీల పాటలతో, నేతల ప్రసంగాలతో మారుమోగిపోగా.. ప్రచారం సమయం ఈరోజు ఐదు గంటలతో ముగిసిపోవటంతో.. ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయాయి. పల్లెలు, పట్టణాల్లోని వాతావరణమంతా.. ఎడతెరపిలేకుండా కురిసిన జోరు వాన వెలిస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది. ఇక ప్రచారానికి తెరపడటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. నవంబర్ 30న జరుగనున్న పోలింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మరిన్ని ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.


ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..


★ ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.


★ అయిదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటారు.


★ ఎన్నికలు ముగిసే వరకు వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు. లిక్కర్ అమ్మకాలు నిషిద్ధం.


★ 3 రోజుల పాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయి.


★ పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు డేగ కన్ను వేస్తారు.


★ ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం నిషిద్ధం.


★ మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం నిషిద్ధం.


★ ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.


అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ నెల రోజులు జోరుగా ప్రచారం నిర్వహించాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రమంతా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగినట్టుగానే చుట్టేశారు. రోజుకు నాలుగు సభల్లో పాల్గొంటూ.. గులాబీ జెండాను ఒంటి చేత్తో ప్రచారం చేశారు. ఆయన తర్వాత కేటీఆర్, హరీశ్ రావు కూడా రాష్ట్రమంతా తిరుగుతూ.. తమదైన మాటకారితనంతో.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రెండు దఫాలుగా బీఆర్ఎస్ సర్కారు చేసిన పని తీరును చెప్తూ ప్రతిపక్షాలపై విమర్శలు సంధిస్తూ.. మూడో సారి అధికారంలోకి వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించారు.


ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా గట్టిగానే కృషి చేశాయి. రాష్ట్రంలోని ముఖ్య నేతలతో పాటు ఢిల్లీ అగ్రనేతలంతా తెలంగాణకు క్యూ కట్టారు. బీజేపీ తరఫున... ప్రధాని మోదీ దగ్గరి నుంచి మొదలుపెడితే కేంద్ర మంత్రులు, మిగతా రాష్ట్రాల సీఎంలు రాష్ట్రమంతా తిరుగుతూ.. కమలం పార్టీ ఎత్తుకున్న బీసీ మంత్రాన్ని గట్టిగానే పటించారు. ఇక హస్తం నేతలు కూడా ఢిల్లీ నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున క్యూ కట్టారు. రాహుల్, ప్రియాంకతో పాటు డీకే శివకుమార్ జోరుగా ప్రచారం చేశారు. మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటారు, విమర్శలు ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో పోటాపోటీగా ప్రచారం రసవత్తరంగా సాగింది. అయితే.. ఈ రాష్ట్రంలో పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యలోనే గట్టిగా నెలకొననున్నట్టు తెలుస్తోంది.


ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ.. ఇన్ని రోజులు ఒక లెక్క ఈ రెండు రోజులు ఒక లెక్క అన్నట్టుగా పరిస్థితులు ఉండనున్నాయి. ఇప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యేవరకు సమీకరణాలు వేరేలా ఉంటాయి. ఇప్పటివరకు పోటాపోటీగా ప్రచారాలు జరిపి ఓటర్లను ఆకర్షించేందుకు కృషి చేసిన రాజకీయ పార్టీలు.. ఇప్పుడు వారిని ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ల దగ్గరున్న చివరి అస్త్రాలను ప్రయోగించనున్నాయి. నగదు, మద్యం, గిఫ్టులు.. ఇలా రకరకాల తాయిలాలను గుట్టుచప్పుడు కాకుండా నేతలు సమర్పించుకోనున్నారు.


నిఘా కంటికి ఏమాత్రం కనిపించకుండా.. చాటుగా లక్ష్మీదేవి చేతులు మారుతూ.. నేతల తలరాతను రాత్రికి రాత్రే మార్చే అవకాశం ఉంది. అయితే.. నగదు, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు పోలీసులు పకడ్బంధీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ.. ప్రత్యేక నిఘా పెట్టారు. అయినప్పటికీ.. చాప కింద నీరుగా.. పంపకాల కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. వాళ్లు వీళ్ల మీద, వీళ్లు వాళ్ల మీద ఆరోపణలు చేసుకుంటూ.. మొత్తానికి చేరాల్సింది చేరాల్సిన చోటికి చేర్చే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేసే అవకాశం ఉంది.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM