byసూర్య | Tue, Nov 28, 2023, 06:40 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం పంపించారు. ఈరోజు ప్రచారానికి చివరి రోజు కాగా.. సోనియమ్మ సందేశం పంపించారు. "ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా.. కానీ మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలి. కలలు సహకారం అవ్వాలి. మీకు మంచి ప్రభుత్వం రావాలి. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. మీ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం. మార్పు కోసం కాంగ్రెస్‌కి ఓటేయండి. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి" అంటూ సోనియా గాంధీ వీడియో ద్వారా తెలంగాణ ఓటర్లకు సందేశం పంపించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఆయా నియోజకవర్గాలలో నిర్వహించిన బహిరంగ సభలతో పాటు రోడ్ షోలలో పాల్గొంటూ.. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అమలు చేసే ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు వివరించారు. అయితే.. ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు ప్రకటించే సందర్భాగా.. సోనియా గాంధీ కూడా సభలో పాల్గొన్న విషయం తెలిసిందే.