byసూర్య | Sun, Mar 19, 2023, 09:20 PM
రాష్ట్రంలో మొదటిసారిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే.. ఇందులో పాల్గొన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలకు గానీ.. అభివృద్ధి కార్యక్రమాలకు గానీ తనను ఎవ్వరూ పిలవటం లేదని సభా ముఖంగా నామా నాగేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎక్కడికి పిలిచినా వస్తానని చెప్పిన నామా.. రాష్ట్ర అభివృద్ధిలో తనను కూడా భాగస్వామిని చేయండని అటు కార్యకర్తలకు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు.
అయితే.. "నాతో మీకు ఎక్కడ, ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్పండి.." అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. మొన్నటి వరకు పొంగులేటిని మాత్రమే పక్కకు పెట్టారనుకుంటే.. ఇప్పుడు నామా కూడా అలాంటి వ్యాఖ్యలే చేయటంతో.. పార్టీలోని లుకలుకలు బయటపడ్డటైందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వ్యాఖ్యల తర్వాత.. పార్టీలోని అందరం కలిసికట్టుగా పనిచేయాలంటూ హితవు పలికారు నామా. వచ్చే ఎన్నికల ద్వారా తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కానున్నారని నామా నాగేశ్వర్ రావు జోస్యం చెప్పారు.