నిబద్ధతతో పని చేయండి.... ఆర్టీసీ కానిస్టేబుళ్లకు సూచించిన సంస్థ ఛైర్మన్

byసూర్య | Sun, Mar 19, 2023, 03:37 PM

విధుల్లో నిబద్ధతతో పని చేయాలని ఆర్టీసీ కానిస్టేబుళ్లకు ఆ సంస్థ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్  సూచించారు.  హైదరాబాద్ కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌లో టీఎస్ఆర్టీసీకి చెందిన 166 మంది కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ముఖ్య అతిథిగా, సంస్థ ఎండీ వీసీ సజ్జానర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల నుంచి వారు గౌరవ వందనం స్వీకరించారు. కారుణ్య నియామకం ద్వారా ఇటీవల 166 మంది టీఎస్ఆర్టీసీలో కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారు. వారిలో 107 మంది పురుషులు కాగా, 57 మంది మహిళలు ఉన్నారు. కొండాపూర్ 8వ బెటాలియన్‌లో పోలీస్ శాఖ సహకారంతో వీరికి ఒక నెల పాటు శిక్షణ ఇప్పించారు.


శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.. సంస్థకు కానిస్టేబుళ్లు కళ్లు, చెవులలాంటివని అన్నారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపిన ఆయన.. నిబద్ధతతో పని చేయాలని సూచించారు. కర్తవ్యాన్ని విస్మరించొద్దని, తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగం సులువు కాదని.., క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. సంస్థలోని 50 వేల మంది సిబ్బందిని, బస్సులను కాపాడాల్సిన బాధ్యత కానిస్టేబుళ్లపై ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. గతేడాది కాలంగా వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నట్లు చెప్పారు. కొత్త బస్సులను కొనుగోలు చేస్తూనే.. నియామకాలను చేపడుతున్నామని బాజిరెడ్డి వెల్లడించారు.


కొత్తగా 166 మంది కానిస్టేబుళ్లు టీఎస్ఆర్టీసీలో చేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని.. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. అందులో మూడో వంతు అంటే 57 మంది మహిళలు ఉండటం శుభపరిణామన్నారు. ఈ కొత్త రక్తంతో సంస్థ మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శిక్షణలో మాదిరిగానే నిబద్ధతతో విధులు నిర్వహించాలని కానిస్టేబుళ్లకు సజ్జనార్ సూచించారు. 2014 నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామ‌కాల కింద 1,606 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వెల్లడించారు. టీఎస్ ఆర్టీసీ సంస్థలో కానిస్టేబుళ్ల బాధ్యత ఎంతో కీలకమని.. చెప్పారు. అదే నిబద్ధతతో పని చేస్తూ సంస్థ అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ వృద్ధి కోసం 50 వేల మంది సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో మీరు భాగం కావాలని పిలుపునిచ్చారు.


ఒక నెలలో కానిస్టేబుళ్లకు సమర్థవంతంగా శిక్షణ ఇచ్చిన టీఎస్ఎస్పీ అదనపు డీజీపీ స్వాతి లక్రా, కొండాపూర్ 8 వ బెటాలియన్ కమాండెంట్ మురళి కృష్ణకు ఈ సందర్బంగా సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన సృజన్ (బెస్ట్ ఆల్ రౌండర్), రమా దేవి (బెస్ట్ ఇండోర్), పూజిత, సాయి కిరణ్ (బెస్ట్ ఔట్ డోర్)లకు బాజిరెడ్డి, సజ్జనార్ ట్రోఫీలను అందజేశారు.Latest News
 

మానవత్వం చాటుకున్న కేటీఆర్ Wed, May 22, 2024, 01:44 PM
భార్యను చంపిన భర్త Wed, May 22, 2024, 01:40 PM
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మధు Wed, May 22, 2024, 12:48 PM
నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి Wed, May 22, 2024, 12:18 PM
కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం Wed, May 22, 2024, 12:16 PM