ఇలాంటి లీకులు సరికాదు.... బండి సంజయ్

byసూర్య | Sun, Mar 19, 2023, 03:32 PM

తనపై మహిళా కమిషన్ సీరియస్ అన్న వార్తలపై స్పందించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తపుడు లీకుల వార్తలు  రాయడం సరికాదని మీడియాను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల బండి సంజయ్‌పై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయినట్లు వార్తలొచ్చాయి. కవితపై చేసిన వ్యాఖ్యల గురించి దాదాపు రెండున్నర గంటల పాటు బండిని శనివారం మహిళ కమిషన్ విచారించింది. రాజకీయంగా లేదా ఏ విధంగా అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, మరోసారి ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయకూడదని మహిళా కమిషన్ హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.


మహిళ పట్ల అనేక సందర్భాల్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి మహిళా కమిషన్ విచారణ చేసినట్లు చెబుతున్నారు. మహిళలను లంగలు, దొంగలు అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యల లాంటి వీడియోలను కూడా చూపించి విచారించినట్లు వార్తలొచ్చాయి. మహిళల పట్ల మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు చెబుతున్నారు. మ‌హిళ‌ల‌పై మ‌రోసారి సామెత‌ల‌ను ప్ర‌యోగించవద్దంటూ మహిళా కమిషన్ చెప్పినట్లు తెలుస్తోంది.


అయితే మహిళ కమిషన్ తనపై సీరియస్ అయ్యిందంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బండి సంజయ్ కొట్టిపారేశారు. సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ చేస్తే తప్పులేదని, కానీ ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ లీక్ ఇచ్చినట్లుగా తాను భావించడం లేదని తెలిపారు. మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషనే వివరణ ఇవ్వాలని బండి సూచించారు. రాజ్యాంగబద్దంగా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై తనకు గౌరవం ఉందని, అందుకే మహిళా కమిషన్ పిలవగానే విచారణకు హాజరయ్యానని చెప్పారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చానని, తన స్టేట్‌మెంట్‌ను మహిళా కమిషన్ రికార్డు చేసినట్లు చెప్పారు.


మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు సుహ్రుద్బావ వాతావరణంలో జవాబిచ్చానని బండి తెలిపారు. కవితపై అనుకోకుండా చేసిన వాఖ్యలు తప్ప తాను ఎలాంటి దురుద్దేశంతో చేయలేదన్నారు. కాగా మరోసారి బండి సంజ‌య్‌ని మహిళా కమిషన్ విచారించే అవకాశముందని తెలుస్తోంది.


Latest News
 

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి అందించిన ప్రభుత్వ విప్ Thu, Mar 23, 2023, 03:57 PM
6 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి Thu, Mar 23, 2023, 03:44 PM
బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి Thu, Mar 23, 2023, 03:13 PM
రేపు బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు భూమిపూజ Thu, Mar 23, 2023, 01:29 PM
అలర్ట్: రెండు రోజుల పాటు వర్షాలు Thu, Mar 23, 2023, 12:12 PM