బంగారు తెలంగాణ అని చెప్పి బొందలగడ్డ చేశాడు...రేవంత్ రెడ్డి

byసూర్య | Fri, Jan 27, 2023, 11:50 PM

బంగారు తెలంగాణ అని చెప్పి బొందలగడ్డ చేశాడు అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ ఇండ్లు లేనిచోట మేం ఓట్లు అడగం.. డబుల్ బెడ్‌ రూం ఇండ్లు లేనిచోట మీరు ఓట్లు అడగొద్దు.. సరేనా అంటూ బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు. హాత్ సే హాత్ జోడో యాత్ర అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు, దౌల్తాబాద్, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గి మండలాల్లో రేవంత్ పర్యటించారు. "ఇందిరమ్మ ఇండ్లు లేనిచోట మేం ఓట్లు అడగం.. ఏ ఊర్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వలేదో ఆ ఊర్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు. ఇందుకు డ్రామారావు సిద్ధమా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప.. ఈ ఐదేళ్లలో కొడంగల్‌కు మీరు చేసిందేంటి? నాపై కోపంతో నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పక్కన పెట్టారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే తప్ప కొడంగల్‌కు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు." అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


"కొడంగల్ ప్రజలకు నా చేతనైన సాయం చేశాను. ఇప్పుడు కొడంగల్‌లో పరిస్థితి మారింది. ఏ పంచాయితీ అయినా బీఆర్ఎస్ నేతలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఎన్నికలప్పుడు.. కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా సరే దౌల్తాబాద్‌కు జూనియర్ కాలేజీ తీసుకొస్తా అని హరీష్ రావు అన్నారు. మరి కాలేజీ ఎందుకు తేలేదు? పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ ఇవ్వలేదు. మాకెందుకు కృష్ణా నీళ్లు, రైల్వే లైను, జూనియర్ కాలేజీ రాలేదు. టీఆరెస్‌కు ఓటు వేయడమే ఇక్కడి ప్రజలు చేసిన తప్పా?" అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.


"కాంగ్రెస్‌ను గెలిపించుకుందాం.. కొడంగల్‌ను అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్ చేసుకుందాం. కొడంగల్‌కు ఇంజినీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం. ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్‌రూం ఇల్లు, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, మైనారిటీ, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అని కేసీఆర్ ఎన్నో మాయమాటలు చెప్పి రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బొందలగడ్డ చేశాడు." అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్.. రెండు పార్టీలు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ పాలనలో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఎక్కడ చూసినా విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. రాహుల్ సందేశాన్ని ప్రతీ గుండెకు, ప్రతీ ఇంటికి చేర్చేందుకు హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. ఇంటింటికి కరపత్రాలు అందించి, హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించి రాహుల్ సందేశాన్ని చేరవేయాలని రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. "ఫిబ్రవరి 6 నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలలా పర్యటించడానికి సోనియా గాంధీ, ఖర్గే నాకు అవకాశం ఇచ్చారు. మీ ఆశీర్వాదం తీసుకుని పాదయాత్రకు వెళ్లడానికే ఇక్కడకు వచ్చా" అని రేవంత్ రెడ్డి తెలిపారు.


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM