ఆ ఎమ్మెల్యే అడిగిన వెంటనే నిజయోజకవర్గానికి రూ.100 కోట్లు మంజూరు

byసూర్య | Sun, Nov 27, 2022, 11:58 AM

ఇటీవలం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్  స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే రాగా కాంతారావు అభ్యర్థన మేరకు ఆ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్‌ కింద ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసింది. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్, మరుగు కాల్వలు, వీధి దీపాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఇలా మెుత్తం 31 రకాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 100 కోట్లు కేటాయించటంతో ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు.


ఇదిలా ఉండగా.. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి. తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫాం హౌస్‌లో బేరసారాలు జరిగాయని అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఎమ్మెల్యేలు ఫైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలతో పాటు రేగ కాంతారావులను ప్రలోభ పెట్టేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారని కేసు నమోదైంది.


పార్టీ మారినందుకు గానూ ఫైలట్ రోహిత్ రెడ్డికి రూ. 100, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల చొప్పున బేరసారాలు జరిగినట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు.. కొనుగోళ్లకు యత్నించిన ముగ్గురు నిందితులు రామంచంద్రభారతి, సింహయాజీ, నంద కుమార్‌లను అరెస్టు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచి కస్టడీకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పలువురు అనుమానితులకు నోటీసులు ఇచ్చి విచారణ వేగవంతం చేసింది.


అయితే ఈ వ్యవహారం గత నెలలో వెలుగులోకి రాగా.. నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను మీడియాకు వెల్లడించారు. ఇక అప్పటి నుంచి దాదాపు నెల రోజుల పాటు నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. నెల రోజుల తర్వాత వారు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లారు. ఈ కేసు తర్వాత పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు.. సీఎం కేసీఆర్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయన సీఎంకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. దీంతో సీఎం రూ. 100 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఒక్క పినపాక నియోజకవర్గానికే రూ. 100 కోట్ల నిధులు మంజూరు కావడంతో జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రేగా నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్లు తెచ్చారని, మీరెందుకు నిధులు తీసుకురావటం లేదని.., అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రజలను నిలదీస్తున్నట్లు సమాచారం. స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నిధులు తమ నియోజకవర్గాలకు కూడా తీసుకురావాలంటూ ప్రజలు ఎమ్మెల్యేలను ఎక్కడిక్కడ నిలదీస్తున్నారని తెలసింది.


 


Latest News
 

తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నం Fri, Jun 02, 2023, 08:11 PM
అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి,,,తెలంగాణ ప్రజలకు ప్రధాని రాష్ట్ర ఆవతరణ శుభాకాంక్షలు Fri, Jun 02, 2023, 08:10 PM
తెలంగాణలో ఆషాడ బోనాలు,,,ప్రభుత్వం తరపున నిధులు మంజూరు Fri, Jun 02, 2023, 08:09 PM
ఆయనలా డబ్బులు పంచడం నాకు చేతగాదు.... రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శ Fri, Jun 02, 2023, 08:08 PM
అమరవీరుల త్యాగ ఫలితం "మన తెలంగాణ",,,వై.ఎస్. షర్మిల Fri, Jun 02, 2023, 08:08 PM