ప్రియాంకా వస్తే ...ఇందిరాగాంధీ వచ్చినట్లే...సంబరాల్లో టీఎస్ కాంగ్రెస్ నేతలు

byసూర్య | Wed, Aug 17, 2022, 08:20 PM

ప్రియాంకా గాంధీ వస్తే తెలంగాణకు ఇందిరాగాంధీ వచ్చినట్లేనన్న చర్చ తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైంది. ఇంతకాలం పరస్పర గ్రూపు విభేదాలతో భగ్గుమంటున్న తెలంగాణ కాంగ్రెస్ లో ప్రియాంకా రాకతో వాటికి అడ్డుకట్ట పడే అవకాశముందని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న కీలక ఆయుధాల్లో ప్రియాంక గాంధీ ఒకరు. అందుకే ఆమెను ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రంగంలోకి దింపారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రియాంక ఫలితాలను రాబట్టలేదు. 400లకు పైగా అసెంబ్లీ స్థానాలున్న యూపీలో.. కేవలం రెండుచోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ప్రియాంక అన్నీ తానై వ్యవహరించినా.. ఫలితం మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. ఒకానొక దశలో ప్రియాంకనే సీఎం క్యాండెట్ అనే చర్చ కూడా జరిగింది. అయినా.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక ఘోరంగా విఫలమైంది.


ఆ తర్వాత కొన్నిసార్లు ప్రియాంక గాంధీ కనిపించినా.. ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంకకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని ప్రియాంక ఈ రెండు రాష్ట్రాల్లో రాణిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అందుకే ప్రియాంక గాంధీ ఈ రాష్ట్రాల్లోకి రంగంలోకి దిగితే.. ప్రభావం ఎంత అనే చర్చ నడుస్తోంది. కర్ణాటక విషయం ఎలా ఉన్నా.. తెలంగాణలో ప్రియాంక పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారా అని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.


నేరుగా ప్రియాంక రంగంలోకి దిగడంతో.. పార్టీ నేతలు స్వయంగా అధిష్టానంతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో వర్గపోరుకు చెక్ పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా.. ఉత్తర భారతదేశంతో పోలిస్తే.. గత ఎన్నికల్లో సౌత్ ఇండియా నుంచే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. దీంతో సౌత్ ఇండియాపై.. ముఖ్యంగా తెలంగాణపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే ప్రియాంకకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే యాక్టివ్ గా ఉన్న కాంగ్రెస్ కేడర్.. ప్రియాంక ఎంట్రీతో మరింత ఉత్సాహంగా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో ఇందిరమ్మ పాలన అనే పదం చాలా ఫేమస్. ప్రియాంక కూడా దాదాపు ఇందిరాగాంధీ లాగానే ఉంటారు. దీంతో సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు వేరేవైపు వెళ్లకుండా ఉపయోగపడతారు అనే చర్చ నడుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పుడు, గతంలో పార్టీ ఇంఛార్జులుగా ఉన్నవారితో సమస్యలు తగ్గకపోగా.. ఎక్కువయ్యాయి. దీంతో నేరుగా ప్రియాంకనే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మాణిక్కం ఠాగూర్, గతంలో పనిచేసిన గులాంనబీ ఆజాద్, దగ్విజయ్ సింగ్ పార్టీకి పెద్దగా పనికొచ్చే పనులు చేయకపోగా.. నష్టం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.


ప్రియాంక ఎంట్రీపై పాజిటివ్ కామెంట్స్ ఇలా ఉంటే.. నెగెటివ్ కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో చాలాసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రియాంక ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ ఇష్యూ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. యూపీలో పోటీ ఇవ్వలేని ప్రియాంక.. తెలంగాణ తమకు పోటీ ఇస్తుందా.. అని ఇప్పటికే ఇతర పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రియాంక వస్తే.. లాభం జరుగుతుందా.. నష్టం జరుగుతుందా అని నేతలు చర్చించుకుంటున్నారు.


Latest News
 

ఎలక్ట్రీసిటీ బిల్లు పేరిట సైబర్ నేరగాళ్ల దోపిడి Wed, Jul 24, 2024, 04:21 PM
నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి: జిల్లా కలెక్టర్ Wed, Jul 24, 2024, 04:18 PM
భిక్కనూరు మండల పంచాయతీ అధికారి బాధ్యతల స్వీకరణ Wed, Jul 24, 2024, 04:15 PM
మున్నూరు కాపు మండల అధ్యక్షునిగా రాము Wed, Jul 24, 2024, 04:13 PM
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ Wed, Jul 24, 2024, 04:07 PM