![]() |
![]() |
byసూర్య | Wed, Aug 17, 2022, 08:19 PM
తెలంగాణలో బీసీ నేతగా గుర్తింపు ఉన్న సీనియర్ నేత కె.లక్ష్మణ్‌ను ఇటీవలే రాజ్యసభకు పంపిన బీజేపీ.. తాజాగా రెండు కీలక కమిటీల్లో ఆయనకు స్థానం కల్పించింది. బీజేపీ కొత్తగా ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీలో లక్ష్మణ్‌ను సభ్యుడిగా నియమించింది. పార్లమెంటరీ కమిటీ అనేది బీజేపీ అత్యున్నత నిర్ణాయక కమిటీ. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నాయకత్వంలో 11 మంది సభ్యులతో ఈ కమిటీని బీజేపీ ప్రకటించింది. ఈ బోర్డులో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్‌కు చోటు కల్పించారు.
15 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ లక్ష్మణ్‌కు చోటు కల్పించారు. నడ్డా అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, బీఎస్ సంతోష్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, భూపేంద్ర యాదవ్, ఓం మాథూర్, వనతి శ్రీనివాస్‌కు స్థానం దక్కింది.
బీజేపీ పార్లమెంటరీ కమిటీ నుంచి మోదీ కేబినెట్‌లోని సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీని పక్కనబెట్టారు. ఎన్నికల కమిటీలోనూ ఆయనకు స్థానం దక్కలేదు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను సైతం ఈ కమిటీ నుంచి తప్పించారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా 77 ఏళ్ల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు రెండు కమిటీల్లోనూ చోటు కల్పించడం గమనార్హం.