నోవాటెల్‌లో మోదీ బస.. హోటల్‌ మొత్తం బుక్ చేసిన బీజేపీ!

byసూర్య | Fri, Jul 01, 2022, 11:40 AM

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ హోటల్‌లో బస చేయనున్నారు. ప్రధాని రాక పర్యటనపై భద్రతను సమీక్షించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అధికారులు ప్రధానికి నోవాటెల్‌ హోటల్‌లోనే బస ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మోదీ రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని ముందుగా భావించారు. అయితే రాజ్‌భవన్‌ నుంచి హెచ్ఐసీసీ 14 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు భావించాయి.

హైదరాబాద్ నగర పోలీసులు సైతం ఇదే విషయాన్ని ఎస్పీజీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాజ్‌భవన్ నగరం మధ్యలో ఉండటంతో ప్రధాని బస చేసిన సమయంలో ఎవరైనా ఆందోళనకు దిగే అవకాశముందని హెచ్చరించారు. పంజాబ్‌లో మోడీ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలతో పాటు ప్రధాని పర్యటన వేళ హైదరాబాద్‌లో నిరసనలు తెలుపుతామని కొన్ని రాజకీయ పార్టీలు, ఎంఆర్పీఎస్ వంటి ప్రజాసంఘాలు ప్రకటించడంతో నోవాటెల్ హోటల్‌ని ఫైనల్ చేసినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంలోనే 2004లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చిన అప్పటి ప్రధాని వాజ్‌పేయి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలోని ఓ స్టార్‌ హోటల్‌లో బస చేసిన సంగతిని కొందరు గుర్తు చేసుకుంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో బస చేస్తారు. మొత్తం 288 గదులున్న ఈ హోటల్‌లో ప్రధాని బస కోసం ఓ ఫ్లోర్‌ మొత్తం రిజర్వు చేసినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్‌ మొత్తాన్ని బుక్‌ చేశారని హోటల్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ హోటల్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు అణువణువూ తనిఖీ చేస్తున్నారు. హోటల్‌లో పనిచేసే సిబ్బంది, కుటుంబ సభ్యుల వివరాలను ఎస్పీజీ బృందాలు సేకరించాయి. వారి ఇళ్లకు కూడా వెళ్లి తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.


Latest News
 

బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం Tue, Apr 30, 2024, 10:29 AM
పథకాలే గెలిపిస్తాయి: ఎంపీ అభ్యర్థి నీలం మధు Tue, Apr 30, 2024, 10:16 AM
వాహనాలు తనిఖీ చేసిన సీఐ Tue, Apr 30, 2024, 10:13 AM
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM