సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ కు చేరాలంటే ?
 

by Suryaa Desk |

ఐపీఎల్ 2020 సీజన్లో ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ కేవలం మూడు విజయాలతోనే సరిపెట్టుకుంది. చెన్నై, ఢిల్లీ, పంజాబ్ జట్లపై మాత్రమే గెలుపొందిన సన్‌రైజర్స్.. మిగతా ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. పంజాబ్‌పై గెలుపొందిన తర్వాత.. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో వరుసగా పరాజయం పాలైంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. అనవసరంగా వికెట్లు పారేసుకొని.. ఆఖరి ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చుకొని ఓడింది.


ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్‌కు ఎంతో కీలకమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండుంటే.. సన్‌రైజర్స్, కోల్‌కతా ఖాతాలో చెరో 8 పాయింటు ఉండేవి. మెరుగైన రన్ రేట్ కారణంగా ఆరెంజ్ ఆర్మీ టాప్-4లోకి చేరడంతోపాటు.. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎంతో మెరుగయ్యేవి. మరో మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. లీగ్ దశ ముగిసే నాటికి నెట్ రన్ రేట్ తేడాతో టాప్-4లో నిలిచేది.


ఇప్పటికీ ప్లేఆఫ్స్ చేరొచ్చు..


కానీ కోల్‌కతాతో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఓడటం ద్వారా సన్‌రైజర్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కానీ ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇకపై ఆడబోయే 5 మ్యాచ్‌ల్లో నాలుగింటిలో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. కోల్‌కతా, పంజాబ్, రాజస్థాన్ జట్ల గెలుపోటములు కూడా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. రన్ రేట్ మెరుగ్గా ఉండటం ఒక్కటే ప్రస్తుతానికి ఆరెంజ్ ఆర్మీకి ఊరటనిచ్చే అంశం.


సన్‌రైజర్స్ తర్వాతి మ్యాచ్‌ల్లో రాజస్థాన్ (అక్టోబర్ 22), పంజాబ్ (అక్టోబర్ 24), ఢిల్లీ (అక్టోబర్ 27), బెంగళూరు (అక్టోబర్ 31), ముంబై (నవంబర్ 3) జట్లతో తలపడనుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ.. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జట్లతో సన్‌రైజర్స్ తలపడాల్సి ఉంది. కాబట్టి.. గెలవడానికి మెరుగైన వ్యూహాలు రచించడంతోపాటు.. తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.


జట్టులో మార్పులు తప్పనిసరి:


కోల్‌కతాతో మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ ఓడినా.. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి మార్పులే చేస్తే ఫలితం ఉంటుంది. ఫీల్డింగ్‌లో చక్కటి క్యాచ్‌లు అందుకుంటున్న ప్రియమ్ గార్గ్.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మినహా మిగతా మ్యాచ్‌ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. మనీష్ పాండే సైతం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వీరి స్థానాల్లో విరాట్ సింగ్, అభిషేక్ శర్మలను ఆడించాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.


యువ హిట్టర్ విరాట్ సింగ్‌ను సన్‌రైజర్స్ రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ అతణ్ని ఆడించలేదు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో 106 రన్స్ మాత్రమే చేసిన ప్రియమ్ గార్గ్‌ను జట్టు ప్రయోజనాల కోణంలో ఇకనైనా పక్కనబెట్టాలి.


గాయపడిన విలియమ్సన్ తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే.. టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి తుది జట్టులో చోటు కల్పించాలి. భువీ లేకపోవడంతో.. బౌలింగ్‌లో సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. బెసిల్ థంపీ స్థానంలో ఆంధ్రా బౌలర్ పృథ్వీ రాజ్ యర్రాకు అవకాశం ఇవ్వాలి.


వచ్చే సీజన్‌కు ముందు జరిగే వేలంలో.. మిడిలార్డర్‌లో సత్తా చాటే భారత బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవడంతోపాటు.. భువీ స్థానాన్ని భర్తీ చేయగలిగే బౌలర్.. ఓ నిఖ్ఖాసైన ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకోవాలి. సన్‌రైజర్స్‌‌లో టాప్-4 ఆటగాళ్లు ఓవర్సీస్ ప్లేయర్లే ఉన్నారు. వీరికి సరితూగే భారత క్రికెటర్లు సైతం జట్టులో ఉండాలి. అప్పుడే ఆరెంజ్ ఆర్మీ సమతూకం సాధిస్తుంది.


Latest News
తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు Thu, Nov 26, 2020, 05:33 PM
టీఆర్ఎస్ పాలనలో భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందింది: కేటీఆర్ Thu, Nov 26, 2020, 05:12 PM
బీజేపీ పై ఎంపీ రేవంత్ రెడ్డి ఫైర్ Thu, Nov 26, 2020, 04:32 PM
బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టో విడుదల Thu, Nov 26, 2020, 03:59 PM
ఆ పార్టీలను ఓటర్లు ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు: రేవంత్ రెడ్డి Thu, Nov 26, 2020, 03:28 PM