ఎంపీ ఎన్నికల బరిలో బాబూ మోహన్.. కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ, వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్

byసూర్య | Thu, Apr 25, 2024, 07:24 PM

మాజీ మంత్రి, సినీ నటుడు బాబూ మోహన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. నెల క్రితం బీజేపీకి గుడ్‌బై చెప్పి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన ఆయన.. ఆ పార్టీ తరపున వరంగల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నామినేషన్లకు నేడు చివరి రోజు కావటంతో వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన కారును కార్యాలయం లోపలికి అనుమతించలేదు. తాను అనార్యోగంతో బాధపడుతున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులపై బాబూ మోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశానని ఎప్పుడూ ఇలాంటి వింత రూల్స్ చూడలేదన్నారు. అనంతరం ఆయన వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.


కాగా, తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాబు మోహన్ బీజేపీ తరఫున ఆందోల్ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో బాబూ మోహన్ ఓడిపోయారు. అయితే ఈ టికెట్‌ కేటాయింపు అంశం ఆ సమయంలో వివాదాస్పదమైంది. బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. చివరి నిమిషంలో బాబూ మోహన్‌కు బీజేపీ టికెట్ కేటాయించింది. అనంతరం ఆయన కుమారుడు ఉదయ్.. బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.


పార్టీ నుంచి బయటకు వచ్చే సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు బాబూమోహన్. కంపు నుంచి బయటకు వచ్చానని అన్నారు. పార్టీ ఎదగకూడదనే వ్యక్తులు బీజేపీలో ఉన్నారన్నారు. అయితే వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆశించి.. భంగపాటు ఎదురు కావటంతోనే ఆయన బయటకు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరగా.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ముందుగా ప్రకటించారు. కానీ అనుహ్యంగా చివరి నిమిషంలో వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబూమోహన్ బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తుండగా.. బాబూమోహన్ ఎంట్రీతో పోరు రసవత్తరంగా మారింది.


Latest News
 

గోమాసకు మద్దతుగా ప్రచారం Thu, May 09, 2024, 03:44 PM
వంశీని పార్లమెంటుకు పంపండి.. Thu, May 09, 2024, 03:41 PM
పదేళ్లు ఎంపీగా ఉన్న నియోజకవర్గానికి చేసింది శూన్యం.. ఇంచార్జ్ Thu, May 09, 2024, 03:34 PM
కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ కోసం Thu, May 09, 2024, 03:31 PM
విద్యార్థులు సమ్మర్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి Thu, May 09, 2024, 03:29 PM