సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి

byసూర్య | Wed, Apr 24, 2024, 07:49 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి గెలుపు వ్యుహాలను రచిస్తోంది. ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) అన్నీ తానై ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. రోజూ రెండు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్‌లు, సభలకు హాజరై.. అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.


ఇవాళ సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రోడ్‌షో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. ఈ సారి సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. 2004, 2009లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిచిందని.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. ఈసారి సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని.. మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని జోస్యం చెప్పారు.


ఇక్కడ దానం నాగేందర్ గెలిస్తే.. కేంద్రంలో మంత్రి పదవి ఇప్పింటే బాధ్యత తనదని అన్నారు. ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. జంట నగరాలు వరదలతో మునిగితే కిషన్ రెడ్డి ఏమైనా చేశారా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మంచోడే కానీ.. ఆయన పరువు తీయడానికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆయన్ను పోటీలో నిలబెట్టారన్నారు. పద్మారావు గౌడ్ నామినేషన్ కార్యక్రమంలో పట్టుమని 10 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పద్మారావును ఓడించి కిషన్ రెడ్డిని గెలిపించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ మురికిలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు.


కాగా, 2004,2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా విజయం సాధించారు. ఆ పదేళ్లు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక 2014లో బీజేపీ అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ, 2019లో కిషన్ రెడ్డి ఎంపీలుగా గెలిచారు. ఈ పదేళ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇలా ఇక్కడ గెలిచిన పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తుందనే సెంటిమెంట్ ఉంది.


Latest News
 

నేడు భునవగిరిలో అమిత్‌ షా ప్రచారం Thu, May 09, 2024, 10:36 AM
రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM