ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే

byసూర్య | Mon, Oct 21, 2024, 10:13 PM

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైనట్టు సమాచారం. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో కౌశిక్ రెడ్డి.. తన భార్య, కూతురితో కలిసి రీల్స్ చేయటంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో.. సోమవారం (అక్టోబర్ 21న) రోజున పఠాన్ చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పవిత్రమైన ఆలయ నిబంధనలకు విరుద్ధంగా కౌశిక్ రెడ్డి భార్య, కుమార్తెతో కలిసి.. సినిమా పాటలకు రీల్స్ చేయడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త అయిన సుభాష్ చంద్ర.. పఠాన్ చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.


ఎమ్మెల్యేగా.. ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కౌశిక్ రెడ్డి.. ఇలా పవిత్రమైన పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఇలాంటి వెకిలి చేష్టాలు చేయటం సరికాదని సుభాష్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చూసి.. రేపు రేపు మరింత మంది యాదాద్రిలో రీల్స్ చేసేందుకు ఎగబడతారని సుభాష్ చంద్ర అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఇంకోసారి ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సుభాష్ చంద్ర కోరారు.


అయితే.. ఆదివారం (అక్టోబర్ 20న) రోజున పాడి కౌశిక్ రెడ్డి.. తన భార్య శాలిని పుట్టిన రోజు సందర్భంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో.. యాదాద్రిలో తీయించుకున్న ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డితో పాటు ఆయన కుమార్తె శ్రీనిక కూడా.. తన సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పంచుకోగా.. అవి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిబంధనలకు విరుద్దంగా ఇలా వీడియోలు, ఫొటోషూట్లు చేయటం సరికాదంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.


ఇదిలా ఉంటే.. ఈ ఫొటో షూట్ జరిగింది ఆలయం బయటే కావటం గమనార్హం. అయితే.. లోపల్ ఫొటో షూట్ కోసం కౌశిక్ రెడ్డి అనుమతి కోరగా నిరాకరించామని.. కావాలంటే బయట చేసుకోవచ్చని అనుమతించినట్టు.. యాదాద్రి ఈవో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆలయం బయట భక్తులు యథేచ్చగా తమ మొబైల్స్‌లో ఫొటోలు వీడియోలు తీసుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా ఫొటోగ్రాఫర్లు.. స్వయంగా ఫొటోలు తీసి అప్పటికప్పుడు ప్రింట్ తీసి కూడా ఇస్తుంటారు. అయితే.. ఆలయం ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీయటం నిషేధమని ఎప్పుడు ప్రకటించకపోవటం గమనార్హం.


ఇదిలా ఉంటే.. కౌశిక్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియోలు, ఫొటోలు చూస్తుంటే.. వీళ్ల ఫొటో షూట్ జరిగినప్పుడు అక్కడ భక్తులెవరూ కనిపించట్లేదు. దీన్ని బట్టి.. ఫొటో షూట్ కోసమే.. కౌశిక్ రెడ్డి కుటుంబం యాదాద్రిని సందర్శించారంటూ కామెంట్లు వస్తున్నాయి.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM