హైదరాబాద్‌లో దారుణం.. వ్యభిచారం చేయమని కన్న కూతుర్ని ఒత్తిడి చేసిన తల్లి

byసూర్య | Fri, Oct 18, 2024, 09:33 PM

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కన్న తల్లి తన కూతుర్ని వ్యభిచార కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. వ్యభిచారం చేయాల్సిందిగా తల్లి బలవంతం చేయటంతో ఆమె బారి నుంచి తప్పించుకున్న కూతురు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్‌ జేజేనగర్‌ సమీపంలో నివసించే మహిళ (37)కు ఇద్దరు కుమార్తెలు. కొన్నేళ్ల క్రితం భర్త ఆమెను వదిలేయగా.. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఇద్దరు కుమార్తెలను పెంచి పోషించింది. అయితే తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో పెద్ద కుమార్తెను వ్యభిచార కూపంలో దింపింది.


ఏ తల్లి చేయని విధంగా విటుల వద్దకు కన్న కూతుర్ని పంపించి డబ్బులు సంపాదిస్తోంది. చిన్న కుమార్తె (14)ను కూడా వ్యభిచారం కూపంలోకి దించేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టింది. బాలికను ఐదో తరగతి వరకూ చదివించి బడికి పంపించకుండా ఇంటి వద్దే ఉంచుతోంది. అక్క మాదిరిగానే వ్యభిచారం చేయాలని గత కొన్నిరోజులుగా బాలికను వేధిస్తోంది. తల్లి ఒత్తిడిని తట్టుకోలేకపోయిన బాలిక ఇంట్లో నుంచి పారిపోయింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకొని సూసైడ్ చేసుకోవాలని భావించింది. చివరి నిమిషంలో మనసు మార్చుకొని తల్లికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకుంది.


గత బుధవారం రాత్రి అల్వాల్ పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి చేస్తున్న వికృత చేష్టలను పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పింది. తన అక్కను వ్యభిచార కూపంలోకి దించటమే కాకుండా తనను కూడా వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తోందని పోలీసుల ముందు కన్నీటి పర్యంతమైంది. బాధితురాలిని ఓదార్చిన పోలీసులు.. ఆమెను సఖి కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి గురువారం (అక్టోబరు 17) పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. తన కుమార్తెను అప్పగించాలని పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. కానిస్టేబుళ్లు, ఎస్సైలను తీవ్రంగా దుర్భాషలాడింది. ఆమెతో పాటు మరో మహిళ కూడా పోలీసు స్టేషన్‌కు చేరుకొని పోలీసులను విచక్షణారహితంగా తిట్టింది. అనంతరం ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


మరో ఘటనలో బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దన్నందుకు ఓ యువకుడు వృద్ధుడిని చంపేశాడు. తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైన వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. టెంపుల్‌ అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు(69) అనే వృద్దుడు సెప్టెంబరు 30న బస్సు దిగి రోడ్డు దాటుతుండగా అటుగా.. దీపక్‌ అనే యువకుడు బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు దాటే ప్రయత్నం చేసిన ఆంజనేయులును స్వల్పంగా ఢీకొట్టాడు. దీంతో నెమ్మదిగా వెళ్లొచ్చుగా అని ఆంజనేయులు యువకుడిని ప్రశ్నించాడు. కోపోద్రిక్తుడైన దీపక్.. వృద్ధుడిపై దాడి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులు బుధవారం కన్నుమాశాడు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM