కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్

byసూర్య | Sat, Sep 28, 2024, 08:58 PM

మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ నదిలా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏమిటి ముఖ్యమంత్రి గారూ... అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళన కోసం రూ.50 వేల కోట్లు అవుతుందని మొన్న చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న రూ.50 వేల కోట్లు అవుతుందని చెప్పారని, నిన్న రూ.70 వేల కోట్లు వెచ్చిస్తామని చెప్పారని, నేడు రూ.1.50 లక్షల కోట్లు అంటున్నారని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ కోసం రూ.1.50 లక్షల కోట్లా? అని ప్రశ్నించారు.తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం రూ.80 వేల కోట్లు అయితే ఇదే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని విమర్శించారు. "మరి, సుందరీకరణకే రూ.లక్షా యాభై వేల కోట్లా..! పదిహేను పక్కన ఇన్ని సున్నాలా..!! 15,000,000,000,000" అని విమర్శించారు.ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందురు..! నిల్వ ఉంచే టీఎంసీలెన్ని..! సాగులోకి వచ్చే ఎకరాలెన్ని..!! పెరిగే పంటల దిగుబడి ఎంత..!! తీర్చే పారిశ్రామిక అవసరాలెంత..!!! కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని..!!! అని నిలదీశారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టు పైనే ఎందుకింత మక్కువ? అని నిలదీశారు.చివరిదశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి, కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం..?? లండన్‌లోని థేమ్స్‌లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి?? ముఖ్యమంత్రి గారు... అని ప్రశ్నించారు.మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని ఆరోపించారు. తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించేది లేదన్నారు. "మూసీ రివర్ ఫ్రంట్" పేరిట బ్యాక్ డోర్‌లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోందన్నారు. కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రు గాల్చి వాతపెట్టడం ఖాయమన్నారు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM