హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్

byసూర్య | Sat, Sep 28, 2024, 10:34 PM

హైడ్రాను ఒక బూచీగా, రాక్షసిగా చేసి చూపొద్దనీ.. ప్రజలకు, భవిష్యత్ తరాలకు అదొక భరోసా అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, వాటి వెనుక ఉన్న అసలు విషయాల గురించి మీడియా సమావేశంలో వివరించారు. హైడ్రాపై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ అనేక అంశాల మీద స్పష్టత ఇచ్చారు. విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అప్పగించిందని రంగనాథ్‌ చెప్పారు. ఈ రెండు విషయాలు ఒకదానితో మరొకటి సంబంధం ఉన్న అంశాలని వివరించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడగలిగేతేనే నగర ప్రజలకు వరదలు, ముంపు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పారు.


హైడ్రా కూల్చివేతల మీద వివరణ ఇచ్చేందుకు, సందిగ్ధాలను నివృత్తి చేసేందుకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎండీ దాన కిశోష్‌తో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్.. శనివారం (సెప్టెంబర్ 28) మీడియా సమావేశం నిర్వహించారు. రంగనాథ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..


✦ ఇప్పటివరకూ అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశాం. ఎక్కడా పేదవాళ్ల ఇళ్ల జోలికి వెళ్లలేదు.


✦ ఎన్ కన్వెన్షన్ పక్కన కూడా చాలా మంది పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. బఫర్ జోన్‌లోని ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేశాం గానీ, పేదల ఇండ్లను టచ్ చేయలేదు.


✦ కొన్ని కట్టడాలను కూల్చివేయగానే హైడ్రా బాగా పనిచేస్తోందని హైటైల్ చేశారు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.


✦ పెద్దలకు చెందిన భవనాలను కూల్చలేదని ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో మీరే చూస్తారు. న్యాయపరమైన ప్రొసీడింగ్స్, బ్యాగ్‌గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.


✦ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూల్చివేస్తాం. ఎవరినీ వదిలిపెట్టం.


✦ ఒవైసీ కాలేజీ గురించి:


ఒవైసీ కాలేజీ మాత్రమే కాదు.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన కాలేజీల పైనా ఫిర్యాదులు అందాయి. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారనే వాటిపై ముందుకువెళ్లలేదు. సరైన సమయంలో వాటిపైనా చర్యలు తీసుకుంటాం.


✦ అమీన్‌పూర్ ఆస్పత్రి:


అమీన్‌పూర్‌లో ఒక ఆసుపత్రి కూల్చివేతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆ ఆస్పత్రిపై గతంలో అధికారులు అనేకసార్లు చర్యలు తీసుకున్నారు. ఏడాది కిందట నిర్మాణ దశలో ఉన్నప్పుడే కూల్చివేశారు. అయినా, ఏమాత్రం భయం లేకుండా తిరిగి నిర్మాణం కొనసాగించారు. మూడుసార్లు నోటీసులు ఇచ్చాం. ఆ తర్వాతే కూల్చివేశాం. అందులో పేషంట్లు ఉన్నారంటూ వీడియోలు వైరల్ చేశారు. ముందు రోజే ఆస్పత్రి మొత్తం వీడియోలు తీసుకున్నాం. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే కూల్చివేశాం.


✦ అందరూ ఒక్కటి గమనించాలి.. పేదవాళ్ల ఇండ్లు అని చెప్తున్న చోట్ల వాటి వెనుక ఉన్నది పెద్దవాళ్లు. పేదవాళ్లు కాదు. పేదవాళ్లను ముందుపెట్టి ఆరోపణలు చేస్తున్నారు.


✦ సున్నంచెరువులో కూల్చివేతల వీడియో


మాదాపూర్‌లో సున్నంచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశాం. వెంకటేష్ అనే ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వాస్తవానికి ఆయన అక్కడ వాటర్ ట్యాంకర్లతో బిజినెస్ చేస్తున్నారు. ప్రభుత్వం స్థలంలో నిత్యం దాదాపు 20 ట్యాంకర్లు ఉంటాయి. తన వ్యాపారం కోసం అక్రమంగా ప్రభుత్వ స్థలాని వాడుకుంటున్నాడు. అక్కడే పనిచేసేవాళ్లు కొంత మంది అక్కడే ఉంటారు. అలాంటి వాటిమీద చర్యలు తీసుకున్నాం. లేకపోతే, ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్తుంది.


✦ అనుమతులున్నా కూల్చివేతలు ఎందుకు..?


అన్ని అనుమతులు ఉన్నా కూల్చివేస్తున్నారంటూ కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి వాలిడ్ అనుమతి ఉన్న ఏ ఒక్క నిర్మాణం జోలికి హైడ్రా రాలేదు, రాదు. వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండటం సహజం. గతంలో అధికారుల వల్ల, ప్రజాప్రతినిధుల వల్ల తప్పులు జరిగి ఉంటే.. అవి సరిచేసి చర్యలు తీసుకుంటాం.


✦ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో పర్మిషన్లు ఉన్నాయంటే.. అవి కొన్నేళ్ల కిందట ఎవరో ఒకరు ప్రభావితం చేసి పర్మిషన్లు తీసుకున్నట్టే లెక్క. పర్మిషన్ తీసుకున్నాం అంటూ ఒక చోట సర్పంచ్ రాసిచ్చిన పత్రం చూపించారు. ఎవరుపడితే వారు రాసిస్తే.. అది పర్మిషన్ ఉన్నట్టు కాదు. సక్రమమైన అనుమతులు ఉన్న ఇండ్లను హైడ్రా టచ్ చేయదు.


✦ ఒకవేళ.. అన్ని అనుమతులూ ఉండి మూసీ ప్రాజెక్టు అవసరాల కోసం ఆ నిర్మాణం కూల్చివేయాల్సిన అవసరం ఏర్పడితే.. ప్రభుత్వం నుంచి వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నష్టపరిహారం అందిన తర్వాతే, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ముందుకెళ్తాం.


✦ మహిళ ఆత్మహత్యపై..


హైడ్రా భయంతో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందనే వార్త వినగానే చాలా బాధేసింది. హైడ్రాను ఒక బూచీగా ప్రచారం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. బుచ్చమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి ఇండ్లను రాసిచ్చారు. ఆ ఇండ్లు బఫర్ జోన్ల పరిధిలో ఉన్నాయని, హైడ్రా అధికారులు కూల్చివేస్తారని స్థానికంగా ప్రచారం జరిగింది. ఆందోళనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ప్రజలు నివసిస్తున్న భవనాలను హైడ్రా ఎక్కడా కూల్చలేదు.


Latest News
 

హైడ్రా రాక్షసి కాదు.. ఒక భరోసా; బాధితులు వాళ్లు కాదు.. వీళ్లు: రంగనాథ్ Sat, Sep 28, 2024, 10:34 PM
అప్పుడలా.. ఇప్పుడిలా.. హైడ్రా కూల్చివేతలపై కేఏ పాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Sat, Sep 28, 2024, 10:32 PM
దేవర సినిమా కోసం టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ ట్వీట్,,, పోస్టుకు నెటిజన్లు రకరకాల కామెంట్లు Sat, Sep 28, 2024, 10:30 PM
బస్సులో మహిళకు పురిటినొప్పులు.. ఆర్టీసీ సిబ్బంది మాన‌వ‌త్వం Sat, Sep 28, 2024, 10:27 PM
కాళేశ్వరంకు రూ.80 వేల కోట్లు అంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందన్న కేటీఆర్ Sat, Sep 28, 2024, 08:58 PM