టీటీడీకి తెలంగాణ పశుసంవర్ధక శాఖ లేఖ,,,,శ్రీవారికి నాణ్యమైన నెయ్యి అందించేందుకు సిద్ధం

byసూర్య | Sat, Sep 21, 2024, 08:39 PM

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల లడ్డూ వివాదం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు.. జంతువుల కొవ్వును వాడినట్టుగా వస్తున్న ఆరోపణలు.. శ్రీవారి భక్తులతో పాటు యావత్ హిందూ సమాజం నిర్ఘాంతపోయేలా చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఈ వ్వవహారంపై స్పందిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ లడ్డూ వివాదంపై స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణకు చెందిన విజయ డెయిరీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది.


తిరుమల లడ్డూ తయారీకీ తాము స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తామని టీటీడీకి విజయ డెయిరీ ప్రత్యేక ప్రతిపాదన పంపింది. శ్రీవారికి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. తెలంగాణ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సవ్యసాచి ఘోష్ స్పష్టం చేశారు. ఈ మేరకు టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు సవ్యసాచి శనివారం (సెప్టెంబర్ 21న) రోజున లేఖ రాశారు.


దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెలంగాణ విజయ డెయిరీ సంస్థ ప్రసిద్ధి చెందిందని.. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్ర కలిగి ఉందని లేఖలో సవ్యసాచి పేర్కొన్నారు. విజయ డెయిరీ ఉత్పత్తుల్లో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని చెప్పుకొచ్చారు.


తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలు తీర్చేందుకు విజయ డెయిరీ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. విజయ డెయిరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయాల్లో పూర్తి పారదర్శకంగా ఉంటుందని సవ్యసాచి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే విశేషమైన అవకాశాన్ని విజయ డెయిరీకి కల్పించాలని లేఖలో సవ్యసాచి విజ్ఞప్తి చేశారు.


మరి.. తెలంగాణ విజయ డెయిరీ చేసిన ఆఫర్‌కు టీటీడీ ఎలాంటి స్పందన ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా.. గతంలో కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యిని వాడిన టీటీడీ ఇప్పుడు కూడా మళ్లీ అదే సంస్థ ఉత్పత్తులు వాడాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో.. పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు అవకాశమిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.


అయితే.. మొన్నటివరకు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ సంస్థ.. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తూ వచ్చింది. అయితే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని.. కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు.. ఇప్పుడు అగ్గిరాజేశాయి. చంద్రాబాబు చేసిన ఆరోపణలకు సంబంధించి.. టెస్ట్ రిపోర్టులు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో.. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం.. హాట్ టాపిక్‌గా మారింది.


Latest News
 

నవరాత్రుల నయ దృశ్యం.. వినాయక నిమజ్జనంలో అఘోరాలు Sun, Sep 22, 2024, 10:06 AM
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM