విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన

byసూర్య | Sat, Sep 21, 2024, 11:29 PM

తెలంగాణ ఏర్పడిన పదేళ్లకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర పాలనలో తనదైన ముద్ర వేసుకోవాలని అన్ని రకాలుగా కృషి చేస్తోంది. రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలతో పాటు పాలనలో భాగంగా తీసుకునే విధానపరమైన నిర్ణయాల వరకు.. అన్నింట్లో గత ప్రభుత్వ వానసలు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది. మరోవైపు.. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు.. ప్రభుత్వపరంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయటంతో పాటు.. ప్రైవేటు రంగంలోనూ భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే.. పెద్ద పెద్ద సంస్థలు, విదేశి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది.


అయితే.. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రెండు మార్లు విదేశీ పర్యటన చేపట్టగా.. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించారు. మొదట్లో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. పెద్ద పెద్ద కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ పర్యటన ఫలవంతమైందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. ఇటీవల అమెరికా, నార్త్ కొరియాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. భారీగా పెట్టుబడులను ఆకర్షించినట్టు తెలిపింది. అయితే.. ఇప్పటివరకు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేపట్టగా.. ఇప్పుడు అదే లక్ష్యంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా విదేశీ పర్యటనకు బయలుదేరారు.


తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 04 వరకు.. అమెరికా, జపాన్, టోక్యో దేశాల్లో పర్యటించనున్నారు. ఆయా దేశాల్లో మైనింగ్, గ్రీన్ పవర్ రంగాలపై భట్టి విక్రమార్క అధ్యయనం చేయనున్నారు. ఈ మేరకు.. భట్టి వెంట ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, ఇంధన కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్, ఎండీ ఎన్ బలరామ్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు విదేశీ పర్యటనకు పయనమయ్యారు.


భట్టి విక్రమార్క పర్యటన షెడ్యూల్ ఇదే..


ఈ టూర్‌లో భట్టి విక్రమార్క.. ప్రముఖ కంపెనీల హెడ్ ఆఫీసులను సందర్శించనున్నారు. మైనింగ్, గ్రీన్ పవర్ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ ఎక్స్‌పోలో పెట్టుబడిదారులతో భేటీ అవుతారు. షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో లాస్ వెగాస్‌లో జరిగే ఇంటర్నేషనల్ మైనింగ్ ఎక్స్‌పోలో భట్టి పాల్గొంటారు. అక్కడ.. వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో భట్టి బృందం చర్చలు జరుపుతుంది. ఇక.. సెప్టెంబర్ 27న.. అమెరికాలోని అతిపెద్ద సింగిల్ సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అయిన ఎడ్వర్డ్స్, సాన్‌బార్న్ సోలార్ ఫెసిలిటీని భట్టి టీం సందర్శిస్తారు. ఇక.. సెప్టెంబర్ 28న పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులతో భేటీ అవుతారు. ఆ తరువాతి రోజు (సెప్టెంబర్ 29న) టోక్యోకు బయలుదేరుతారు.


ఇక.. సెప్టెంబర్ 30న స్థానిక పెట్టుబడిదారులతో రౌండ్ టేబుల్ సమావేశంలో భట్టి పాల్గొంటారు. అక్టోబర్ 01న పెట్టుబడిదారులతో వన్ టూ వన్ భేటీ కానున్నారు. అదే రోజు యామాన్షి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును సందర్శిస్తారు. ఇక.. అక్టోబర్ 2న తోషిబా, కవాసాకి.. అక్టోబర్ 3వ తేదీన పానసోనిక్ కంపెనీల హెడ్ ఆఫీసులను భట్టి విక్రమార్క బృందం సందర్శించనుంది. కాగా.. అక్టోబర్ 4వ తేదీన ఈ బృందం హైదరాబాద్‌కు తిరుగు పయణమవనుంది.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM