హైదరాబాద్‌ రీజినల్ రింగు రోడ్డు.. ఆ భూముల్లో రైతులకూ వాటాలు

byసూర్య | Fri, Sep 20, 2024, 07:08 PM

హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్ఆర్ఆర్‌ నిర్మాణంపై ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక సీనియర్ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో.. రోడ్లు, భవనాలు, రెవెన్యూ, ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖతో పాటు మరికొన్ని శాఖల అధికారులతో ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా.. దక్షిణ భాగంలోని రీజినల్ రింగు రోడ్డును ఔటర్‌ రింగు రోడ్డు మాదిరిగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌, బిల్డ్‌- ఆపరేట్‌- టోల్‌ పద్ధతుల్లో ఏది అమలు చేయాలన్న విషయంపై ఈ ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేయనుంది.


మరోవైపు.. రీజినల్ రింగు రోడ్డుకు ఇరువైపులా భూములను సమీకరించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్డుకు ఇరువైపులా.. ఐటీ, పారిశ్రామిక హబ్‌లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. రహదారి అలైన్‌మెంట్‌తో పాటు రోడ్డు నిర్మాణం కోసం భూముల గుర్తింపు, పరిహారం అందజేత లాంటి పలు అంశాలపై ఈ ఉన్నతస్థాయి కమిటీ లోతుగా అధ్యయనం చేయనుంది. అనంతరం.. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పూర్తి రిపోర్టును సర్కార్‌కు అందించనుంది. ఇందులో భాగంగా.. రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఫ్యూచర్‌ సిటీతో పాటు ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, బెంగళూరు హైవేలన్నీ అధిక భాగం ఈ మార్గంలోనే ఉండడంతో అలైన్‌మెంట్‌ ఖరారుపై చాలా జాగ్రత్తగా వ్యవహరించనున్నారు.


నిజానికి.. 2017లో ఆర్‌ఆర్‌ఆర్‌ మంజూరైనప్పుడు.. ఉత్తర, దక్షిణ భాగాలుగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయగా.. ఇందులో మొదటగా.. ఉత్తర భాగం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అయితే.. రోడ్డు మంజూరైన తర్వాత ఏడేళ్లు గడుస్తున్నా.. రకరకాల కారణాల వల్ల ఇప్పటికీ నిర్మాణం జరగలేదు. కేంద్రం ఆశించిన సమయానికి ఉత్తర భాగాన్ని నిర్మించలేని కారణంగా.. మిగిలిన దక్షిణ భాగాన్ని రాష్ట్ర సర్కారు పరిధిలోనే నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.


రహదారిని ఎవరు నిర్మించినా సరే.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈ ఆర్ఆర్ఆర్ కోసం.. ఏళ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్న స్థలాలు కాకుండా వ్యవసాయేతర, అటవీయేతర భూములుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే.. మొత్తం 194 కిలోమీటర్ల పరిధిలో ఆర్ఆర్ఆర్ ఉండగా.. దీని నిర్మాణానికి దాదాపు 2 వేల హెక్టార్ల భూమి అవసరముంది. కాగా.. భూ పరిహారం కింద 6500 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు చేయాల్సి ఉండగా.. మొత్తం రోడ్డు నిర్మాణానికి 16 వేల కోట్లకు పైగా నిధులు కావాలని అధికారుల ప్రాథమిక అంచనాల్లో తేలినట్లు తెలుస్తోంది.


ఇదిలా ఉంటే.. ఈ ఆర్ఆర్ఆర్‌కు ఇరువైపులా రెస్టారెంట్లు, బ్యాకెంట్ హాళ్లు, స్టార్‌ హోటళ్లు నిర్మించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా.. రోడ్డుకు ఇరువైపులా అభివృద్ధి కోసం సేకరించిన భూముల్లో రైతులకు కొంత వాటాను అందించాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. అయితే.. జాతీయ రహదారుల నిబంధనల్లో మార్పుల నేపథ్యంలో భూ సేకరణకు ముందుగానే పరిహారానికి సంబంధించిన నిధులను రాష్ట్ర సర్కారు కేంద్రానికి డిపాజిట్‌ చేయాల్సి ఉటుంది. ఈ క్రమంలోనే అసలు దక్షిణ భాగాన్ని సొంతంగా నిర్మిస్తే ఎలా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేసి.. నివేదిక సమర్పించనుంది.


Latest News
 

దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిపై.. హెచ్‌ఎండీకే హైకోర్టు నోటీసులు జారీ Fri, Sep 20, 2024, 08:34 PM
పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేయించాలని వినతి Fri, Sep 20, 2024, 08:30 PM
ఓఆర్ఆర్‌పై కొత్తగా మరో మూడు ఇంటర్‌చేంజ్‌లు.. ఆ ప్రాంతాల్లో ఏర్పాటు Fri, Sep 20, 2024, 08:19 PM
పేదలకు రేవంత్ సర్కారు తీపి కబురు... పది రోజుల్లోనే విధివిధానాలు ఖరారు Fri, Sep 20, 2024, 08:17 PM
నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌తో ఇవే ప్రధాన ఎజెండా Fri, Sep 20, 2024, 08:15 PM