రుణమాఫీ దేవుడెరుగు... రైతులు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది

byసూర్య | Fri, Jul 26, 2024, 08:22 PM

తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తొలి విడతలో రూ. లక్షలోపు రుణాలు మాఫీ చేశారు. ఈనెల 18న రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన రేవంత్.. లక్షలోపు రుణాలు కలిగిన దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి సుమారు 6 వేల కోట్లు జమ చేశారు.


అయితే రైతు రుణమాఫీ విషయంలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2018 నుంచి డిసెంబర్ 9 2023 వరకు కటాఫ్ పెట్టారు. ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. కాగా, కొందరు రైతులకు రుణమాఫీ వర్తించినా.. డిసెంబర్ నుంచు జులై వరకు జమ అయిన వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు.


ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగని.. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా రైతులు అప్పులు చేయాల్సి వస్తుందని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఓ రైతు క్రాప్ లోన్‌ను, రూ.9 వేల వడ్డీ కట్టించుకున్న తర్వాతే క్లోజ్ చేసినట్లు చెప్పారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించి వారిపై వడ్డీ భారం లేకుండా చూడాలన్నారు.


'డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి.. 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే.. రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.


ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని తెలంగాణ సీఎంవో అధికారులను కోరుతున్నా.' అని హరీష్ రావు ట్వీట్ చేశారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM